Chandrababu letter to DGP : ఏపీ తెదేపా నేత తిక్కారెడ్డిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. బొంపల్లెలో ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై.. వైకాపా గూండాలు దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ దాడిలో ఐదుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. రాష్ట్రంలో వైకాపా మూకలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలం అవుతున్నారని దుయ్యబట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని లేఖలో చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు కుప్పకూలి శిథిలావస్థకు చేరుకున్నాయని ఆక్షేపించారు. నేరస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారు నేరాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
వైకాపా ప్రోద్బలంతోనే..
Thikka Reddy Incident : తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా శాంతియుత ప్రదర్శనకారులపై హింసాత్మక దాడులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వైకాపా ప్రోద్బలంతోనే తెదేపా నేతలు, క్యాడర్, సానుభూతిపరులుపై అసాంఘిక శక్తులు దాడులకు తెగబడుతున్నారన్నారు. గతంలో 2020 ఫిబ్రవరిలో తిక్కారెడ్డిపై వైకాపా గూండాలు చేసిన దాడిలో తిక్కారెడ్డి తీవ్రంగా గాయపడ్డారని, తిక్కారెడ్డికి అధికార పార్టీ నుంచి ప్రాణహాని, ఆయన ఆస్తులకు ముప్పు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. తిక్కారెడ్డిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఏం జరిగింది?
Attack on Thikka reddy: జిల్లాలోని కోసిగి మండలం పెద్దభూంపల్లిలో ఇటీవల జరిగిన ఆంజనేయస్వామి రథోత్సవంలో తిక్కారెడ్డి పాల్గొన్నారు. ఇదే అదునుగా భావించిన వైకాపా అల్లరి మూకలు దాడులకు తెగబడ్డారు. కర్రలతో ఒక్కసారిగా వైకాపా నాయకులు విరుచుపడ్డారు. వెంటనే తేరుకున్న తెదేపా కార్యకర్తలు తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికి తరలించారు. బాధితులను మంత్రాలయం తెదేపా బాధ్యుడు తిక్కారెడ్డితో పాటు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, తెెదేపా నాయకులు పరామర్శించారు. కాగా.. చికిత్స కోసం వెళ్తున్న నలుగురిని పోలీసులు అడ్డుకున్నారని, ఆదోనికి రాకుండా నిలువరించారని బాధితుడు నరసప్ప చెప్పారు. తమ ప్రాణాలకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యత అని తిక్కారెడ్డి అన్నారు.