Evening OP problems at Osmania Hospital: రోగులకు వీలైనంత త్వరగా, సులభతర సేవలు అందించే లక్ష్యంతో సర్కారు ఈ ఏడాది జులై నుంచి సాయంత్రం ఓపీలను అందుబాటులోకి తెచ్చింది. గాంధీ, ఉస్మానియా సహా ప్రధాన ప్రభుత్వాసుపత్రుల్లో నిత్యం ఉదయం వేళల్లో దాదాపు రెండు వేల మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. అందులో అత్యధికంగా జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్ , జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ విభాగాలకు చెందిన రోగులే ఉంటున్నారు.
సాయంత్రం ఓపీ..రోగుల తాకిడి తగ్గించటం, వీలైనంత త్వరగా సేవలు అందించే భావనతో సాయంత్రం ఓపీని రోగులకు అందుబాటులోకి తెచ్చింది. సాయంత్రం 4 నుంచి ఆరు గంటల వరకు ఆయా విభాగాల వైద్యులు సేవలందిస్తారు. సాయంత్రం ఓపీ సేవల్లో పాల్గొనే వైద్యులకు మరుసటి రోజు విధులకు వెసులుబాటు కల్పిస్తున్నారు. కేవలం వైద్యులు మాత్రమే కాకుండా పరీక్షలు చేసే ల్యాబ్‌లు, మందులు కూడా ఇవ్వాలని జనం కోరుతున్నారు.
కొరవడిన ఆదరణ.. సర్కారు సదుద్దేశంతో సాయంత్రం ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చినా ప్రజల నుంచి ఆదరణ కొరవడింది. ఉదయం దాదాపు రెండు వేలమందికి పైగా సేవలందించే ఉస్మానియా ఆస్పత్రిలో సాయంత్రం ఓపీకి వందలోపే ఉంటున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాల్లో సేవలు అందిస్తున్నా సమాచార లోపం వల్ల ఎవరూ రావడం లేదు. గాంధీ ఆస్పత్రిలో గైనకాలాజీ సహా ఐదు విభాగాల్లో ఓపీ సేవలు ఉన్నా చాలా స్వల్పసంఖ్యలో మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. సాయంత్రం ఓపీ పట్ల సరైన ప్రచారం లేకపోవటం, సీనియర్ వైద్యులు ఉంటారో లేదో అన్న అనుమానంతో ఎవరూ పెద్దగా రావడం లేదని తెలుస్తోంది.