ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 68 వెంటనే రద్దు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. హోర్డింగ్ వ్యవస్థకు మరణ దండన లాంటిందని మండిపడ్డారు. హైదరాబాద్ ఇందిరాపార్క్, ధర్నాచౌక్ వద్ద ఔట్డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టేందుకే జీవో నెంబర్ 68 తీసుకొచ్చారని నేతలు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల లక్ష మంది ఉపాధి కోల్పోతున్నారని... పరోక్షంగా 4 లక్షల మంది రోడ్డున పడే ప్రమాదం ఏర్పడిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. హైదరాబాద్ అందంగా ఉండాలని హోర్డింగ్‌లను రద్దు చేయడం దారుణమన్నారు. అడ్వర్టైజింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 150 కోట్ల ఆదాయం వస్తుందని... దీనిని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రపంచంలో హోర్డింగ్ లేకుండా ఏ దేశం లేదని... ఎక్కడ లేని అంక్షలు గ్రేటర్‌లో ఎందుకు అని ప్రశ్నించారు.