తెలంగాణ

telangana

స్టాక్స్​లో ఇన్వెస్ట్​ చేయాలనుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి..

By

Published : Apr 17, 2022, 1:00 PM IST

Stock Market Investments: కొత్తగా మార్కెట్లో మదుపు చేసే వారి సంఖ్య కొంత కాలంగా ఎంతో పెరిగింది. ఇందులో తొలిసారి పెట్టుబడులు ప్రారంభించిన వారెందరో.. ఐపీఓలు అధికంగా వస్తుండటం, మార్కెట్లు మంచి లాభాలను పంచడం.. ఇలా ఎన్నో కారణాలు మదుపరులను స్టాక్‌ మార్కెట్‌ వైపు ఆకర్షించాయి. సూచీల గమనం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. దిద్దుబాట్లు సహజం. ఇది తెలియని కొత్త పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లోకి వచ్చి పొరపాటు చేశామా? అనే సందేహాలూ వస్తున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం అంటూ ప్రత్యేకంగా ఉండదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని, సరైన అవగాహనతో అడుగులు వేసినప్పుడు లాభాల లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు.

Stock market Investments trading for beginners, stock market tips
Stock market Investments trading for beginners, stock market tips

Stock Market Investments: ఏ ఇద్దరు వ్యక్తుల ఆర్థిక పరిస్థితీ ఒకేలా ఉండదు. డబ్బు గురించి వారి ఆలోచనా ధోరణీ విభిన్నంగానే ఉంటుంది. అందుకే, ఒకరికి సరిపోయిన పెట్టుబడి వ్యూహాలు మరొకరికి నష్టాలను మిగులుస్తాయి. స్టాక్‌ మార్కెట్లో అడుగు పెట్టేవారు.. ముందుగా తాము ఎంత మేరకు నష్టం వచ్చినా తట్టుకోగలం అనేది పరిశీలించుకోవాలి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఇది తేలిగ్గా అర్థం కాదు. కానీ, పడిపోతున్నప్పుడు వచ్చిన నష్టాలు మనల్ని ఒక దశలో ఆందోళనకు గురి చేస్తుంటాయి. దీన్ని తట్టుకునే శక్తి ఎంత మేరకు ఉంది అనేదే భవిష్యత్‌ లాభాలకు బాటలు వేస్తుంది. మీ ఆర్థిక స్థితిగతులు, లక్ష్యాలు ఇతర అంశాల ఆధారంగా దీన్ని వాస్తవిక దృష్టితో అంచనా వేసుకోవాలి.

అనుకరణ వద్దు:స్నేహితులు, బంధువులు లేదా సామాజిక వేదికలు.. పెట్టుబడుల గురించి సలహాలు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. వారి సలహాలతో కొన్నిసార్లు మీకూ లాభాలు వచ్చి ఉంటాయి. కానీ, పెట్టుబడులు పెట్టేందుకు ఇదొక్కటే కారణం కాకూడదు. చాలామంది తమ పెట్టుబడులు లాభాలను పంచిన విషయాలనే బయటకు చెబుతుంటారు. కానీ, నష్ట పోయిన మొత్తం గురించి ఎక్కడా మాట్లాడరు. అందుకు ఇష్టపడరు. మీకు ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు.. అందులో ఉండే నష్టాల గురించి ముందుగా చెప్పాల్సిందిగా అడగండి. కొద్దిమంది మాత్రమే నష్టాల గురించి చెబుతుంటారు. మార్కెట్‌ పెరుగుతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు.. రెండు దశల్లోనూ మీ సొంత అవగాహనతోనే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

అర్థం చేసుకోవాలి:బుల్‌ మార్కెట్లో అన్ని షేర్లూ ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో కొత్త పథకాలు, వినూత్న ఆవిష్కరణలు, విదేశీ మార్కెట్లో పెట్టుబడి అవకాశాలు.. ఇలా ఎన్నో ముంచెత్తుంటాయి. పెట్టుబడిదారులకు అవగాహన పెంచుకునేందుకు తగిన వ్యవధీ లభించదు. చరిత్రను పరిశీలించినా.. మంచి రాబడులే కనిపిస్తుంటాయి. ఒక్కసారిగా పతనం ప్రారంభమైనప్పుడు.. అది ఎందుకు తగ్గుతోంది అన్న విషయాన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒకవేళ మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతే.. ఆ పథకంలో మదుపు చేయకపోవడమే ఉత్తమం. ఉదాహరణకు మీకు విదేశీ మార్కెట్లో పెట్టుబడి గురించి ఏమాత్రం అవగాహన లేకపోతే.. దానికి దూరంగా ఉండటమే మేలు. మీకు అర్థమై, ఎలాంటి ఇబ్బందులూ లేవు అనుకున్న మార్కెట్లోనే పెట్టుబడులు పెట్టండి.

లక్ష్యం ఎంచుకున్నాకే:పెట్టుబడులు పెట్టడం అంటే.. ఒక పందెం కాదు.. దీనికి ఒక లక్ష్యం ఉండాలి. దాన్ని సాధించాలనే తపన ఉండాలి. అందుకు అనువైన పథకాలు, వ్యవధి, మొత్తం అన్నింటి గురించీ ఆలోచించాలి. దీర్ఘకాలిక దృక్పథం, ఆర్థిక క్రమశిక్షణ అవసరం. ప్రతి పెట్టుబడినీ ఒక ఆర్థిక లక్ష్యంతో ముడిపెట్టాలి. ఈక్విటీల్లో మదుపు చేయాలనుకుంటే కనీసం ఏడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలి. అప్పుడే స్వల్పకాలిక హెచ్చుతగ్గులు మిమ్మల్ని భయపెట్టవు.

అందరికీ అన్ని విషయాలూ తెలియాలని లేదు. మనకు తెలియని అంశాలపై నిపుణుల సలహా తీసుకోవడానికి ఇబ్బంది పడకూడదు. మంచి సలహాలు మీ పెట్టుబడులు హరించి పోకుండా కాపాడతాయి. మదుపు చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు తప్పవు. కానీ, వీటిని వీలైనంత తొందరగా గుర్తించి, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. స్టాక్‌ మార్కెట్లో ప్రతి దశలోనూ పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. వీటిని ఎంత వేగంగా అందుకుంటున్నామన్నదే ఇక్కడ కీలకమని గుర్తుంచుకోవాలి.

- రాధికా గుప్త, ఎండీ-సీఈఓ, ఎడిల్‌వైజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌

ఇవీ చూడండి:దేశంలో భారీగా తగ్గిన పెట్రో వాడకం.. ధరల మంటే కారణమా?

హనుమాన్​ శోభాయాత్రలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

ABOUT THE AUTHOR

...view details