దేశంలో వంట నూనె ధరలు(edible oil price) మండిపోతున్న తరుణంలో కేంద్రం ఉపశమనం కల్పించింది. ధరలు తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెల బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 2.5 శాతానికి, ముడి సోయా, ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ సుంకాలను 7.5 నుంచి 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శనివారం నుంచే కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేసింది.
తాజా నిర్ణయంతో.. ముడి పామ్ఆయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై సుంకాలు 24.75 శాతం, శుద్ధి చేసిన పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై మొత్తం సుంకాలు 35.75 శాతంగా ఉంటాయని సాల్వెంట్ ఎక్సట్రాక్టర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహ్తా తెలిపారు.
"ప్రభుత్వ నిర్ణయంతో నూనెల రిటైల్ ధరలు లీటరుకు రూ.4-5 వరకు దిగొస్తాయి. ప్రభుత్వం ఆవాల నూనెపైనా దిగుమతి సుంకాన్ని తగ్గించాలి. గత కొద్ది నెలల్లో కేంద్రం పలు వంట నూనెలపై సుంకాలను తగ్గించింది. వంట నూనెల స్టాక్, ఓల్సెల్, మిల్లర్లు, రిఫైనర్ల వద్ద నూనె గింజల వివరాలపై రాష్ట్రాల నుంచి సమాచారం తీసుకుంది. మరోవైపు.. పామాయిల్ మిషన్ కింద రూ.11,040 కోట్లు ప్రకటించింది."