రోజురోజుకు అనూహ్యంగా పెరుగుతున్న వంటనూనెల ధరలను కట్టడి చేయటానికి కేంద్రం రంగంలోకి దిగింది. సరసమైన ధరలకు వంట నూనెలు ప్రజలకు అందేలా చూసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ నేతృత్వంలో ఆ శాఖ కార్యదర్శి సీనియర్ అధికారులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి, వంట నూనె గింజల ఉత్పత్తిదారులు, నూనె మిల్లర్లు, నూనె నిల్వదారులు, వంట నూనెల పరిశ్రమకు చెందిన వివిధ రంగాలవారు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి మాట్లాడుతూ వంట నూనెల ధరల పెరుగుదలకు కారణాలను తెలుసుకోవడానికి, సమస్య పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ఈ రంగంలోని అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని తెలిపారు.