తెలంగాణ

telangana

Yerra Gangi Reddy: సీబీఐ కోర్టులో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి..! రిమాండుకు అవకాశం.!

By

Published : May 5, 2023, 7:41 AM IST

Updated : May 5, 2023, 8:05 AM IST

Yerra Gangi Reddy: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డి.. నేడు సీబీఐ కోర్టులో లొంగిపోవడంపై ఉత్కంఠ రేపుతోంది. ఈనెల 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని.. అలా కాని పక్షంలో అరెస్ట్ చేయాలని తెలంగాణ హైకోర్టు CBIకి ఆదేశాలివ్వడంతో నేడు ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.

Yerra Gangi Reddy
Yerra Gangi Reddy

సీబీఐ కోర్టులో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి..! రిమాండుకు అవకాశం.!

Yerra Gangi Reddy: మాజీ మంత్రి YS వివేకానందరెడ్డి హత్య కేసులో A1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. మధ్యాహ్నం లోపు న్యాయవాదుల సమక్షంలో లొంగిపోవాలని ఎర్రగంగిరెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎర్ర గంగిరెడ్డి.. శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయిన తర్వాత న్యాయమూర్తి రిమాండు విధించే అవకాశం ఉంది.

ఎర్రగంగిరెడ్డి లొంగిపోతే.. ఈ కేసులో ఆరుగురు నిందితులను సీబీఐ జైలుకు పంపినట్లవుతుంది. ఇప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, YSభాస్కర్ రెడ్డిలు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వివేకా కేసులో ఎర్రగంగిరెడ్డి పాత్ర చాలా కీలకంగా మారింది. వివేకా హత్యకు పథక రచన చేయడంతో పాటు దాన్ని అమలు చేసి, తర్వాత సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలోనూ ఎర్రగంగిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు CBI పేర్కొంది.

నెలరోజుల ముందే ఎర్రగంగిరెడ్డి ఇంట్లో వివేకా హత్యకు కుట్ర: 2019 మార్చి 15 తెల్లవారుజామున వివేకానందరెడ్డిని.. ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కలిసి గొడ్డలితో నరికి చంపినట్లు 2021 అక్టోబరు 26న పులివెందుల కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో తెలిపింది. నెలరోజులు ముందే ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే హత్యకు కుట్ర పన్నారని..ఛార్జిషీట్లో వెల్లడించింది. వివేకాను హత్య చేస్తే... దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి 40కోట్ల రూపాయలు సుఫారీ ఇస్తాడని.. ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో తెలిపాడు. కేసు నుంచి కాపాడేందుకు మన వెనక YS.భాస్కర్ రెడ్డి, YSఅవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నారనే విషయాలను కూడా ఎర్రగంగిరెడ్డి తోటి నిందితులకు చెప్పి ధైర్యం కల్పించారనేది సీబీఐ వాదన. నలుగురు నిందుతులు అడ్వాన్సు కింద చెరో కోటి రూపాయలు తీసుకున్నట్లు కూడా సీబీఐ వెల్లడించింది..

లొంగిపోయిన అనంతరం కస్టడీకి కోరే అవకాశం:గొడ్డలితో హత్య చేసి.. బలవంతంగా వివేకాతో లేఖ కూడా రాయించారని సీబీఐ పేర్కొంది. హత్య చేసిన తర్వాత తిరిగి వెళ్తూ.... నిందితులను చూసిన వాచ్‌మెన్‌ రంగన్నను కూడా ఎర్రగంగిరెడ్డి బెదిరించినట్లు వెల్లడించింది. మరుసటి రోజు ఉదయం ఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలో ఎర్రగంగిరెడ్డి కీలకంగా వ్యవహరించాడని తెలిపింది. హత్య జరిగిన రోజు రాత్రి ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి మరికొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఎర్రగంగిరెడ్డి ధైర్యం చెప్పినట్లు పేర్కొంది. సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు అన్ని తుడిచి వేశామని... పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించవని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాడు. ఇక అంతా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చూసుకుంటారని... మీకు రావాల్సిన డబ్బులు కూడా త్వరలోనే అందుతాయని ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లు సీబీఐ పేర్కొంది. ఎర్రగంగిరెడ్డి లొంగిపోయిన తర్వాత.. కస్టడీకి కోరే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

Last Updated :May 5, 2023, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details