వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోవటం వంటి సమస్యలతో పెను ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఓ చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతూ పొరుగు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది ఓ పల్లెటూరు. ఆ ఊరిని ఓ చిరు అడవిలా తీర్చిదిద్దేందుకు పూనుకుని.. 10వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గ్రామస్థులు. అందులో భాగంగా.. ఇప్పటివరకు 2వేల మొక్కలను నాటి.. ఓ చిన్నపాటి అడవినే సృష్టించారు. జపాన్ సాంకేతికతను ఉపయోగించి 'మినీ ఫారెస్ట్'ను రూపొందించిన ఆ గ్రామంపై ప్రత్యేక కథనం.
ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరిగిపోతున్న నీటి వనరులను చూసి.. తమిళనాడు- కోయంబత్తూర్ జిల్లా అన్నూర్ ప్రాంతంలోని సెమ్మని చెట్టిపాలియం గ్రామం తల్లడిల్లిపోయింది. దానికితోడు ఆ పరిసర ప్రాంతాల్లో గత పదేళ్లుగా ఇనుము, ఉక్కు కర్మాగారాలు పుట్టుగొడుగుల్లా పుట్టుకురావడం గమనించింది. కాలానుగుణంగా వర్షాలు లేకపోవడం, పశువుల పెంపకం నానాటికీ తగ్గిపోవడం వంటివి అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలిచివేశాయి. భూతాపంతో.. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి.
ఇదీ చదవండి:'దేశంలో 80% పల్లెలు వైద్యానికి దూరం'
జపాన్ సాంకేతికతను సాయంతో..
జరుగుతున్న పరిణామాలను పసిగట్టిన స్థానికులు.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలు మనుగడ సాగించడం కష్టమనుకున్నారు. దీన్ని అధిగమించి ఆ ఊరిని మళ్లీ పచ్చదనంతో ముంచెత్తాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా ముందడుగేశారు. జపనీయులు వాడే సాంకేతిక పరిజ్ఞానమైన మియావాకీ(జపాన్ వృక్ష శాస్త్రజ్ఞుడి పేరు) పద్ధతిని అవలంబించారు. అలా.. ఇప్పటివరకు 2వేల మొక్కల్ని నాటి, ఆ గ్రామాన్ని ఓ సుందరమైన అడవిలా తీర్చిదిద్దటంలో తొలి విజయం సాధిచారు. సీతాఫలం, సిమర్రౌబా గ్లాకా, పూవరాసన్(పోర్షియా), నిమ్మ వంటి పలురకాల మొక్కలు నాటామని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:'బాహుబలి' స్ఫూర్తితో విల్లు, బాణాల తయారీ
'మా గ్రామం ఓ నమూనాగా..'
"మా గ్రామాన్ని ఇతరులకు ఓ నమూనాగా మార్చాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. దాన్ని ఊరి ప్రజలందరి మద్దతుతో అమలు చేస్తున్నాం. తొలిదశలో రెండువేల మొక్కలను నాటాం. మేము చేపట్టిన ఈ పచ్చదనం కృషితో.. వర్షాలు, భూగర్భజలాలు మళ్లీ పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమం మా ఊరి యువతకు మంచి ప్రేరణగా నిలుస్తోంది."
-పాకియరాజ్, స్థానిక ఉపాధ్యాయుడు