Silicone Child Doll IIIT Delhi : దేశ రాజధాని దిల్లీ ఐఐఐటీలో ప్రారంభించిన మెడికల్ రోబోటిక్స్ సెంటర్.. వైద్య ప్రపంచంలో పెను మార్పులపై ఆశలు రేపింది. ఈ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలోని మావెరిక్ కంపెనీ సిలికాన్‌తో నవజాత శిశువు 'లూసీ' బొమ్మను అభివృద్ధి చేసింది. లూసీ ద్వారా వైద్యులు.. అన్ని వైద్య చికిత్సలను సులభంగా అభ్యసించవచ్చు. మరి ఈ లూసీ కోసం తెలుసుకుందాం.
ఐఐఐటీ దిల్లీలో ప్రారంభమైన మెడికల్ రోబోటిక్స్ సెంటర్.. సిలికాన్‌తో 2500 గ్రాముల లూసీ బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మలోని గుండె కొట్టుకునేలా, శ్వాస తీసుకునేలా అభివృద్ధి చేసింది. వైద్యులు శిక్షణ పొందడంలో ఈ సిలికాన్ సిమ్యులేటర్ బేబీ ఎంతో ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు వైద్యులు, వైద్య విద్యార్థులకు ప్లాస్టిక్ బొమ్మలపై శిక్షణ ఇవ్వగా.. ఇప్పుడు లూసీతో ట్రైనింగ్ మరింత సులభం కానుంది. శుక్రవారం.. మెడికల్ రోబోటిక్స్ సెంటర్లో వైద్యులు, శాస్త్రవేత్తలు.. ట్రైనీ వైద్యులకు ఏవిధంగా శిక్షణ ఇస్తారో వివరించారు.
సిలికాన్ సిమ్యులేషన్ ద్వారా వైద్య విద్యను అభ్యసించి భారత్.. ప్రపంచంలోనే తొలి దేశంగా అవతరించనుందని మావెరిక్ కంపెనీకు చెందిన డాక్టర్ రితేజ్ కుమార్ తెలిపారు. "ఊపిరితిత్తులు, గుండె జబ్బులను దృష్టిలో ఉంచుకుని లూసీని అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో మిగతా అన్ని వ్యాధులను కూడా పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేస్తాం. అది వైద్యులకు మరింత ఉపయోగపడనుంది" అని తెలిపారు.
సిలికాన్‌తో తమ కంపెనీ.. ఆస్కల్టేషన్ టాస్క్ ట్రైనర్ (ATT)ని అభివృద్ధి చేసిందని మావెరిక్ డైరెక్టర్ కనికా చాహల్ తెలిపారు. "దీని ద్వారా పిల్లలు, పెద్దలలో గుండె, ఊపిరితిత్తులు, కడుపు సంబంధిత వ్యాధులను వైద్యులు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అంతే కాకుండా నవజాత శిశువుల పాదాలను కంపెనీ ప్రత్యేకంగా రూపొందించింది" అని చాహల్ తెలిపారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ సైన్స్ సహకారంతో మానవ జీవితాన్ని సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చొరవ ఎంతో అభినందనీయమని ఐఐఐటీ డైరెక్టర్ రంజన్ బోస్ తెలిపారు. దీంతో చిన్నపిల్లల్లో తలెత్తే అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభించనుందని నిపుణులు చెబుతున్నారు.