ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో ఓ రైల్వే ఉద్యోగి.. కుటుంబం అనుమానస్పద రీతిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలపై అక్కడక్కడా కాలిన గాయాలు ఉన్నందున.. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుల్లో రెండున్నరేళ్ల చిన్నారి సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే ఉద్యోగి కుటుంబం అనుమానాస్పద మృతి.. శరీరంపై కాలిన గాయాలు.. అసలేమైంది?
వారణాసిలో ఓ రైల్వే ఉద్యోగి, ఆయన భార్య, రెండున్నరేళ్ల కుమారుడు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆదివారం ఉదయం.. రెండున్నరేళ్ల చిన్నారితో సహా భార్యాభర్తలిద్దరూ మృతిచెంది ఉండడాన్ని ఇరుగుపొరుగు వారు గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వారణాసిలో రాజీవ్ రంజన్ పటేల్ అనే రైల్వే ఉద్యోగి సిగ్నల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. బిహార్‌కు చెందిన రాజీవ్ 2021 ఫిబ్రవరిలో వారణాసికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం రాజీవ్.. భార్య అనుపమ, రెండున్నరేళ్ల కుమారుడు హర్షతో కలిసి కాశీ రైల్వే క్వార్టర్స్‌లోని 29డిలో నివాసం ఉంటున్నాడు. అయితే ఆదివారం ఉదయం రాజీవ్ కుటుంబం ఎంతకీ బయటకు రాకపోయేసరికి.. ఇరుగుపొరుగు వారు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి శరీర భాగాలపై అక్కడక్కడా.. కాలిన గుర్తులను కనుగొన్నారు. వారి నోటి నుంచి నురగ వచ్చినట్లు గుర్తించారు. అయితే వారు చనిపోయి ఉన్న గదిలోని ఓ పొయ్యి నుంచి కార్బన్డయాక్సైడ్ ఎక్కువగా విడుదలైనందునే.. మృతుల నోటి నుంచి నురగ వచ్చినట్లు భావిస్తున్నారు. అయితే మృతుల గది లోపల నుంచి తాళం వేసి ఉన్నందున దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నట్లు ఏసీపీ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు.