తెలంగాణ

telangana

రాహుల్​ గాంధీపై మరో పరువు నష్టం కేసు.. RSSను అలా అన్నారని..

By

Published : Apr 1, 2023, 5:58 PM IST

Updated : Apr 1, 2023, 6:10 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. ఆర్​ఎస్​ఎస్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని హరిద్వార్​ కోర్టులో రాహుల్​పై పరువునష్టం దావా వేశారు ఓ వ్యక్తి. ఇంతకీ ఆర్​ఎస్​ఎస్​ను ఉద్దేశించి రాహుల్ ఏం అన్నారంటే?

rahul gandhi comment on rss
rahul gandhi comment on rss

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్​ఎస్​ఎస్​)పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ రాహుల్​పై ఉత్తరాఖండ్​లోని హరిద్వార్ కోర్టులో పరువునష్టం దావా వేశారు కమల్ భదౌరియా అనే వ్యక్తి. పిటిషనర్ ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త.
ఇంతకీ రాహుల్ ఏమన్నారంటే..
2023 జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్​ గాంధీ.. ఆర్ఎస్​ఎస్​పై విమర్శలు గుప్పించారు. 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ నిక్కరు ధరించి శాఖలు నడుపుతున్నారని ఆర్​ఎస్​ఎస్​ను ఉద్దేశించి విమర్శించారు.

'కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఆర్‌ఎస్‌ఎస్‌ను 21వ శతాబ్దపు కౌరవులతో పోల్చారు. ఆయన ప్రసంగం అసభ్యకరంగా ఉంది. ఆ ప్రసంగం రాహుల్ ఆలోచనా ధోరణిని తెలియజేస్తోంది. దేశంలో ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా సాయం చేసేందుకు ముందుండే సంస్థ ఆర్​ఎస్​ఎస్​. ఈ కేసు ఏప్రిల్ 12న విచారణ జరగనుంది.' అని పిటిషనర్ భదౌరియా తరఫు న్యాయవాది తెలిపారు.

కోర్టు మినహాయింపు కోసం..
మరోవైపు.. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరు నుంచి శాశ్వత మినహాయింపు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని ఠాణె జిల్లా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వాదనలు విన్న కోర్టు.. ఏప్రిల్​ 15కు ఈ కేసును వాయిదా వేసింది.
జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు ఆర్​ఎస్​ఎస్​ కారణమని 2014లో రాహల్​ గాంధీ ఆరోపించారని ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త రాజేశ్ భివాండీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై రాహుల్ గాంధీ 2018 జూన్​లో కోర్టుకు హాజరయ్యారు. తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన సమయం కావాలని.. అందుకే కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపును ఇవ్వాలని రాహుల్​ గాంధీ గతేడాది దరఖాస్తు దాఖలు చేశారు. అయితే సూరత్ కోర్టు రాహుల్​ను ఇటీవల దోషిగా తేల్చిందని.. ఆయన ఎంపీ పదవికి కూడా అనర్హుడయ్యారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. రాహుల్​ గాంధీ ఇప్పుడు ప్రజాప్రతినిధి కానందున.. ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని వాదించారు.

రాహుల్​పై పరువు నష్టం కేసు..
2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ​. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, లలిత్‌ మోదీని ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీకి ముడిపెట్టారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీపై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై మార్చిలో విచారించిన సూరత్​లోని న్యాయస్థానం ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ తీర్పుపై పైకోర్టుకు అప్పీల్​ చేసుకునేందుకు తనకు బెయిల్​ మంజూరు చేయాల్సిందిగా రాహుల్ గాంధీ​ కోర్టును కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. శిక్ష అమలును 30 రోజులు సస్పెండ్ చేసింది. మరోవైపు.. రాహుల్​కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం వల్ల.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది లోక్‌సభ సచివాలయం.

Last Updated : Apr 1, 2023, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details