Precautions to be Taken While Flying Kites : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ క్రేజే వేరు. ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. డూడూ బసవన్న ఆటలు, హరిదాసుల కీర్తనలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండివంటలు, కొత్తబట్టలు, కొత్త అల్లుళ్ల సందళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలానే ఉన్నాయి. అయితే.. సంక్రాంతి పండగలో గాలిపటాలకు ఉండే క్రేజే వేరు. పిల్లల కోటాలోకి వచ్చే ఈ సంబరాల్లో.. పెద్దలు సైతం ఉత్సాహంగా పాల్గొంటారు. పండగకు ముందునుంచే కేరింతలు కొడుతూ గాలిపటాలు ఎగరవేస్తుంటారు.
అయితే.. కైట్స్ ఎగరవేసేటప్పుడు ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఎంత ఎత్తులో ఎగురుతోంది? ఎటువైపు తిప్పాలి? అంటూ పూర్తిగా దృష్టిమొత్తం ఆకాశంలో ఉన్న పతంగి మీదనే పెడతారు. ఈ సమయంలో అడుగు ఎటు పడుతోంది? ఎటువైపు నడుస్తున్నాం? అనే విషయాలు కూడా గుర్తించలేరు. ఎదురయ్యే ప్రమాదాలను కూడా పట్టించుకోలేని స్థితిలో ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు మరింత అజాగ్రత్తగా ఉంటారు. దీంతో ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి.. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు పెద్దలు వాళ్లను ఓ కంట కనిపెడుతుండాలి. ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
హలో పిల్లలూ.. ఈ పతంగుల కథ మీకూ తెలుసా..!
ప్లాస్టర్ చుట్టుకోవాలి:గాలిపటాలు ఎగరవేసే సమయంలో వేళ్లకు ప్లాస్టర్ చుట్టుకోవాలి. దీని వల్ల మాంజా పూసిన దారం వల్ల చేతివేళ్లు తెగకుండా ఉంటాయి. అంతేకాదు.. ఒక్కోసారి గొంతు కూడా తేగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగి రక్తస్రావం జరిగితే, గాయాన్ని శుభ్రంగా కడగాలి. రక్తస్రావం ఆగేందుకు బ్యాండేజితో కట్టేసి, సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గాలిపటాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతాల్లో ఎగరవేయడమే మేలు.
మిద్దెలు ఎక్కక పోవడమే ఉత్తమం:గాలిపటాలు బాగా ఎత్తున ఎగరాలని చాలా మంది సమీపంలోని డాబాలు, ఎతైన గోడలపైకి ఎక్కుతారు. ఇలా ఎత్తైన ప్రదేశాల్లో గాలిపటాలను ఎగరేయడం చాలా ప్రమాదం. పతంగులను పైకి ఎక్కించే క్రమంలో ప్రమాదవశాత్తు జారి కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన ప్రదేశాల్లో గాలిపటాలు ఎగరవేయడం మానుకోవాలి.