కేంద్ర ప్రవేశపెట్టిన నీట్ పరీక్షను అడ్డుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్(stalin cm of tamil nadu ). విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా చూడడంలో సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు స్టాలిన్. అంతేకాకుండా.. ఆయా రాష్ట్రాల్లోని అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ ఎంపీని పంపించారు(neet tamil nadu issue).
సీఎంలకు రాసిన లేఖలో నీట్‌పై వ్యతిరేకత తెలియచేశారు స్టాలిన్(stalin neet news).
"కేంద్రం నీట్‌ను ప్రవేశపెట్టి.. సమాఖ్యవాదాన్ని దెబ్బతీసింది. ఈ విషయాన్ని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము. వైద్యవిద్యా వ్యవస్థ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం తీసుకుని మన హక్కులను హరిస్తోంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు రాష్ట్రాల చేతుల్లోనే ఉండాలి."
--ఎం.కే స్టాలిన్, తమిళనాడు సీఎం.
ఈ నెల 1న స్టాలిన్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, బంగాల్, గోవా సీఎంలకు ఈ లేఖలు వెళ్లాయి.
నీట్‌పై జస్టిస్ ఏకే రాజన్ కమిటీ రూపొందించిన నివేదికను కూడా లేఖతోపాటు పంపారు స్టాలిన్. నివేదికను చదివి, గ్రామీణ, అట్టడుగు వర్గాల విద్యార్థులు మెరుగైన స్థితిలో నిలిచి, ఉన్నత విద్యను అందుకునే విధంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల ఆత్మహత్యలు..
నీట్ పరీక్ష నేపథ్యంలో ఇటీవలి కాలంలో పలువురు తమిళనాడు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 12వ తరగతిలో 93.6 శాతం ఉత్తీర్ణతతో టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థిని.. నీట్ పరీక్ష బాగా రాయలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు సేలం జిల్లాలో ధనుష్ అనే విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్ పరీక్ష రాసిన ఆ విద్యార్థి.. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎంబీబీఎస్ చేయాలన్న తన కల కలగానే మిగిలిపోతుందనే మనోవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.నీట్ పరీక్ష నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించేబిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జస్టిస్ రాజన్ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల మద్దతు కూడగట్టేందుకు స్టాలిన్ సీఎంలకు లేఖలు రాశారు.
ఇదీ చూడండి:-'యువవైద్యులను ఫుట్బాల్లా భావించొద్దు'