Mask mandatory rules: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కొత్త కేసులు అత్యల్పంగా నమోదవుతున్నందున పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొవిడ్ ఆంక్షలను సడలిస్తూ అటు కేంద్రంతో పాటు ఇటు పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి చెందిన రెండేళ్ల తర్వాత మాస్క్ తప్పనిసరి సహా అన్ని ఆంక్షలను ఏప్రిల్ 1 నుంచి ఎత్తివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
- విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కరోనా కట్టడికి విధించిన అన్ని ఆంక్షల తొలగింపు. 2022, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి. అన్ని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులకు పలు సూచనలు జారీ.
- రాష్ట్ర ప్రజలు, వ్యాపార సముదాయాలు, సంస్థల్లో మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించటం వంటి కొవిడ్ నియమాలు పాటించాలని సూచన. మరోవైపు.. కొత్త కేసులు, మరణాలు, వ్యాప్తి వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని డీడీఎంఏలకు ఆదేశం.
మాస్క్‌పై జరిమానాలు బంద్: ఏప్రిల్ 1 నుంచి మాస్క్‌పై జరిమానాలు ఎత్తివేస్తున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు. మరోవైపు.. ప్రజలు స్వచ్ఛందంగా మాస్క్ ధరించాలని కోరింది బృహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్. ఏప్రిల్ 2 నుంచి అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తివేయనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సోమవారం మంత్రివర్గం సమావేశమై కొవిడ్ ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. 'గుడి పడ్వా(మహారాష్ట్ర నూతన సంవత్సరం) నుంచి కొవిడ్-19 సంబంధించిన ఆంక్షలను తొలగిస్తున్నాం.' అని పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో మాస్క్ ధరించటం తప్పనిసరి కాదు.