తెలంగాణ

telangana

TMC నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి.. అభిషేక్​ బెనర్జీ సభ సమీపంలోనే!

By

Published : Dec 3, 2022, 4:17 PM IST

బంగాల్​లోని భాజపా ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్వగ్రామంలో భారీ పేలుడు సంభవించింది. ఓ టీఎంసీ నేత ఇంట్లో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రసంగించాల్సి ఉన్న బహిరంగ సభకు సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.

Bengal Bomb Blast
Bengal Bomb Blast

Bengal Bomb Blast : బంగాల్‌లో పేలుడు ఘటన కలకలం సృష్టించింది. తూర్పు మేదినీపుర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రసంగించాల్సి ఉన్న బహిరంగ సభాస్థలికి 1.5 కిలోమీటర్ల సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం

భాజపా ప్రతిపక్ష నేత సువేందు అధికారి స్వగ్రామమైన భూపతి నగర్​లో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. ముగ్గురి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని, శక్తిమంతమైన బాంబు పేలడం వల్ల ఇల్లు పైకప్పుతో సహా కుప్పకూలిందని పోలీసు అధికారి తెలిపారు.

బాంబు పేలుడు జరిగిన ఇల్లు
అభిషేక్ బెనర్జీ బహిరంగ సభ ఉన్న కారణంగా శుక్రవారం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మొహరించారు. కానీ భారీబందోబస్తు ఉన్న ప్రాంతంలో ఈ పేలుడు సంభవించడం వల్ల భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

'ఎన్​ఐఏ విచారణ జరిపించాలి'
ఈ ఘటనపై భాజపా నేత సువేందు అధికారి స్పందించారు. టీఎంసీ నేత ఇంట్లోనే పేలుడు సంభవించిందని, వారి ఇంట్లో బాంబులు తయారు చేస్తున్నారని ఆయన ట్వీట్​ చేశారు. ఈ ఘటనపై ఎన్​ఐఏ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. పేలుడుకు టీఎంసీనే కారణమని భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు దిలీఫ్ ఘోష్ ఆరోపించారు. రాష్ట్రం బాంబుల తయారీ పరిశ్రమగా తయారైందని విమర్శించారు.

బాంబు పేలుడు జరిగిన ఇల్లు

'సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారు?'
ఈ తరహా ఘటనలపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు. దీనిపై సీఎం ఒక ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, విపక్షాల ఆరోపణలను టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునల్ ఘోష్ తోసిపుచ్చారు. సాక్ష్యాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details