Brahmos missile in Pakistan : పాకిస్థాన్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి పొరపాటున దూసుకెళ్లేందుకు కారణమయ్యారంటూ ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్‌ను శాశ్వతంగా విధుల నుంచి తప్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని మంగళవారం వారికి అందజేసినట్లు వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది. ఆ ముగ్గురు ఉన్నతాధికారులు నియమావళిని సరిగా పాటించకపోవడం.. పొరపాటున క్షిపణి దూసుకెళ్లేందుకు కారణమైందని వాయుసేన పేర్కొంది.
పాక్ భూభాగంలోకి బ్రహ్మోస్ క్షిపణి, ముగ్గురు అధికారులపై వేటు
పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున బ్రహ్మోస్ క్షిపణి దూసుకెళ్లిన ఘటనలో వాయుసేనకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
India Pakistan missile accident : మార్చి 9వ తేదీన పంజాబ్‌లోని అంబాలా వాయుసేన స్థావరంలో సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తుండగా.. ఓ క్షిపణి గాల్లోకి లేచి పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస ప్రాంతాలు ధ్వంసమవ్వగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న రక్షణ శాఖ.. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిపై అప్పట్లోనే పార్లమెంట్‌లో ప్రకటన కూడా చేశారు. దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్నారు.