ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో దారుణం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని పెట్టెలో పెట్టి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న గఢ్‌ముక్తేశ్వర్‌కు తీసుకెళ్లి దహనం చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన భార్య కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 20 రోజుల కిందట జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు, అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాయ్‌పుర్ గ్రామానికి చెందిన వందనా శుక్లా (28)కు అభిషేక్ దీక్షిత్ అనే వైద్యుడితో 2014లో వివాహం జరిగింది. వందనా శుక్లా కూడా డాక్టరే. దంపలిద్దరూ సీతాపుర్‌లో ఓ ఆస్పత్రిని నిర్మించుకుని అక్కడే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా భార్యాభర్తలు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వందన.. చమల్‌పుర్‌లోని లక్ష్మీ నారాయణ్ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు అభిషేక్, అతడి తండ్రి గౌరీ శంకర్.. నవంబరు 26న వందనపై కర్రలతో దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత ఇద్దరూ వందన మృతదేహాన్ని పెట్టెలో పెట్టి గౌరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం అంబులెన్స్‌ను అద్దెకు తీసుకుని వందన మృతదేహాన్ని గఢ్‌ముక్తేశ్వర్‌కు తీసుకెళ్లి దహనం చేశారు.