G20 Bilateral Meetings : ఈనెల 9, 10 తేదీల్లో జీ-20 భారత్ వేదికగా శిఖరాగ్ర సదస్సు సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ దేశాల అధినేతలతో 15కుపైగా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినాతో పాటు మారిషస్ ప్రతినిధులతోనూ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సమావేశాలు ప్రధాని అధికారిక నివాసంలో జరగనున్నట్లు పేర్కొన్నాయి.
ఇక సెప్టెంబర్ 9న(శనివారం) బ్రిటన్, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. సెప్టెంబర్ 10న(ఆదివారం) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో విందు సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కెనడా, తుర్కియే, కొమోరోస్, యూఏఈ, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా ప్రతినిధులతోనూ ప్రధాని మోదీ భేటీ కానున్నారు.
పూర్తి నిఘా నీడలో దిల్లీ..!
సెప్టెంబరు 9,10 తేదీల్లో జరిగే ప్రతిష్ఠాత్మక జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో ఇప్పటికే దిల్లీలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సమావేశం కోసం దేశ రాజధానిని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏ చిన్న పొరపాటు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక గత సంవత్సర కాలంగా జీ-20కి అధ్యక్షత బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత్.. ఈసారి ఈ సమావేశ బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించనుంది.
ఇదీ ఎజెండా..!
ద్రవ్యోల్బణం, మాంద్యం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా ఇతర కారణాలతో సమస్యల్లో చిక్కుకున్న ప్రపంచాన్ని రక్షించడమే ప్రథమ ఎజెండాగా జీ20 కూటమి దేశాలు సమాయత్తమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా భౌగోళిక రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా.. ఆతిథ్య దేశంగా అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ దిల్లీ వేదికగా ప్రపంచ ఆర్థిక సవాళ్లకు మానవీయ దృక్పథంతో పరిష్కారాలు కనుగొనేలా కృషి చేస్తోంది. ఇందుకోసమే శని, ఆదివారాల్లో జీ-20 సదస్సు తర్వాత సంయుక్త ఒప్పందాల కోసం సభ్య దేశాల ప్రతినిధులతో ప్రధాని మోదీ దౌత్యపరమైన చర్చలు నిర్వహించనున్నారు.