Imphal gold seize:బిస్కెట్ల రూపంలో దాదాపు 11 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఇంఫాల్ కస్టమ్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. అతను ఎయిర్ ఏసియా విమానంలో ఇంఫాల్ నుంచి దిల్లీ వెళ్లే క్రమంలో తనిఖీలు నిర్వహించి గట్టు రట్టు చేశారు. బంగారం అక్రమ రావాణా జరుగుతోందనే పక్కా సమాచారంతో ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ముమ్మర తనిఖీలు చేసి స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Gold smuggling news: బంగారం తరలిస్తున్న వ్యక్తిని వాహెంగ్‌బామ్ ఇంబుంగోబి సింగ్‌గా గుర్తించారు అధికారులు. ఇతను ఇంఫాల్ మానింగ్ లికాయ్లోని అవాంగ్ ఖునౌకు చెందినవాడని చెప్పారు. స్మగ్లింగ్‌పై పక్కా సమాచారంతో ఎయిర్ ఏసియా సిబ్బందిని ముందే అప్రమత్తం చేసి చాకచక్యంగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లర్‌పై అనుమానంతో అతడ్ని ఎక్స్‌రే విషన్ ముందు ఉండమన్నారు అధికారులు. అయితే ఆ బ్యాగ్ తనది కాదని, దాన్ని ఇంఫాల్ నుంచి దిల్లీకి చేరవేస్తే డబ్బులు ఇస్తామని మరొకరు చెప్పడం వల్ల తీసుకెళ్తున్నట్లు సదరు వ్యక్తి అధికారులతో బుకాయించాడు. చివరకు బ్యాగును తెరిచి చూడగా.. మొత్తం 10.79కేజీల బరువున్న 65 బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటి విలువ రూ.5.76 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ పసిడి విదేశీ మూలాలకు చెందిందని పేర్కొన్నారు. లగేజీ బ్యాగులో ఓ బ్లాంకెట్ మధ్యలో పాస్టిక్ కవర్లో బంగారాన్ని నిందితుడు దాచినట్లు వివరించారు.