కరోనా మహమ్మారి పట్ల ప్రజలు తేలిక భావన కలిగి ఉండడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి గొలుసును తెంచడంలో కొవిడ్ నిబంధనలు పాటించడమే అతిపెద్ద సాధనమని పునరుద్ఘాటించారు. గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం వైరస్‌పై మనకు పూర్తి అవగాహన కలిగిందని.. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడం సాధ్యమేనన్నారు.
"వైరస్ గురించి పూర్తి అవగాహనలేని సమయంలోనే మహమ్మారిపై విజయం సాధించాం. గతేడాదితో పోలిస్తే వైరస్ తీవ్రత, దాని ప్రవర్తనపై మనకు పూర్తి అవగాహన వచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఎన్95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి."
- హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఇదీ చదవండి:టీకా తీసుకున్నా మళ్లీ వైరస్ సోకడానికి కారణాలేంటి?
వారిపై చర్యలు తీసుకుంటాం..
దేశంలో రెమ్‌డెసివిర్ ఔషధం కొరత ఉందని వస్తోన్న వార్తలపై స్పందించిన మంత్రి.. ఔషధ ఉత్పత్తిని భారీగా పెంచాలని ఇప్పటికే ఆయా ఫార్మా సంస్థలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ను ఎవరైనా బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించామన్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత అధికమవుతోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో శనివారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
మౌలిక సదుపాయాలు పెంచేందుకు..
ఇక.. దేశవ్యాప్తంగా 52 జిల్లాల్లో గత వారం నుంచి కొత్త కేసులు లేవని.. 34 జిల్లాల్లో 14 రోజులుగా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మూడు వారాలుగా నాలుగు జిల్లాల్లో ఒక్క కేసూ వెలుగు చూడలేదని.. 44 జిల్లాల్లో 28 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోన్న వేళ అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో పడకలు, మెడికల్ ఆక్సిజన్‌ను అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని వెల్లడించింది.
ఇదీ చదవండి:బంగాల్ ఎన్నికల అభ్యర్థులపై కరోనా పంజా