ఉచిత వాగ్దానాలను నియంత్రించే అధికారం.. ఎన్నికల సంఘానికి లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఎన్నికల చట్టాలను సరిగ్గా వినియోగించటం ద్వారా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించటంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. ఈనెల 4న ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సవరణలు ప్రతిపాదించిన ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాలకు అయ్యే వాస్తవ ఖర్చు ఓటర్లకు వెల్లడించాలని లేఖ రాసింది. ఈనెల 19లోపు తమ అభిప్రాయం వెల్లడించాలని రాజకీయపార్టీలను కోరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఉచిత వాగ్దానాలు, సంక్షేమ పథకాల మధ్య రాజకీయ పార్టీల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదన చేసింది.
'ఉచితాలను నియంత్రించే అధికారం ఈసీకి లేదు'.. ఎన్నికల్లో వాగ్దానాలపై కాంగ్రెస్
ప్రస్తుతం దేశంలోని అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ఎరగా వేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయ పడి.. ఎన్నికల వాగ్దానాలకు అయ్యే వాస్తవ ఖర్చు ఓటర్లకు వెల్లడించాలని లేఖ రాసింది. దీనిపై భాజపా స్పందించగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీకూడా స్పందించింది.
అంతకుముందు భాజపా సైతం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించే తాయిలాలు, ప్రజాసంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చే వాగ్దానాలు ఎలా నెరవేర్చుతారనే అంశంపై రాజకీయ పార్టీల నుంచి ఈసీ వివరణ కోరిన నేపథ్యంలో భాజపా ఈమేరకు స్పందించింది. ఓటరు చైతన్యంపై రాజకీయ పార్టీలు దృష్టిసారించాలే తప్ప.. ప్రజలు ఒకరిపై ఆధారపడి జీవించేలా చేయకూడదని భాజపా స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా ఈసీకి తమ స్పందన తెలియజేసినట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
ఉచితాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. తమ నుంచి వసూలు చేసిన డబ్బును ఉచితాలకు ఉపయోగిస్తే పన్ను చెల్లింపుదారులు ఎంతో బాధపడతారంటూ కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ధరల పెరుగుదలతో బాధపడుతున్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. అటువంటి వాటిని ఉచితాలు అని పేర్కొంటూ సామాన్య పౌరుడిని అవమానపరచొద్దని హితవు పలికారు.