జమ్ముకశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యం కోసం పాకిస్థాన్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించలేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ త్రిమూర్తి అన్నారు. పాక్ చేస్తోన్న ప్రతి కుట్రను భారత్ తీవ్రంగా ఖండించిందని ఆయన తెలిపారు.
"1965 నవంబర్ తర్వాత భారత్-పాక్ సమస్య ఐరాస భద్రతా మండలిలో చర్చకు రాలేదు. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేసేందుకు పాక్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల జరిగిన రహస్య సమావేశంలో చైనా మినహా అన్ని దేశాలు.. ఇది ద్వైపాక్షిక సమస్య అని అంగీకరించాయి."
- టీఎస్ త్రిమూర్తి
పాక్ ప్రయత్నాలు భద్రతా మండలి ప్రమాణాలను చేరుకోలేదని త్రిమూర్తి అన్నారు. గతేడాది ఆగస్టులో ఐరాస ప్రధాన కార్యదర్శి కూడా 1972 సిమ్లా ఒప్పందాన్ని ఉటంకించారని గుర్తు చేశారు. పాక్ మళ్లీ ప్రయత్నించినా దాని మాట వినేవారు లేరని ఎద్దేవా చేశారు. వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా భారత్ గట్టిగా బదులిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత నుంచి పాక్ అక్కసు మరింత పెరిగింది. కశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు విస్తృతంగా ప్రయత్నించింది.