Two Tribal Women Beaten Naked : మణిపుర్లో ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించిన ఉదంతం మరువకముందే బంగాల్‌లో ఇదే తరహా దారుణ ఘటన జరిగింది. మాల్దా జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను దారుణంగా కొట్టి.. బహిరంగంగా వివస్త్రలను చేశారు కొందరు గ్రామస్థులు. జిల్లాలోని బమంగోలా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాధిత మహిళలు దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో గ్రామస్థులు వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు. అనంతరం ఆ ఇద్దరు మహిళలను అక్కడి స్థానికులు వివస్త్రలను చేశారు. స్థానికుల్లో చాలా మంది మహిళలే ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
సుమోటోగా కేసు నమోదు చేశాం: పోలీసులు
Two Tribal Women Tortured : ఈ ఘటనపై మాల్దా పోలీస్ సూపరిటెండెంట్ ప్రదీప్ కుమార్ జాదవ్ స్పందించారు. "ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినా సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేసేందుకు సీనియర్ అధికారులను ఆ గ్రామానికి పంపించాం. గుర్తు తెలియని వ్యక్తుల కేసు నమోదు చేశారు. నిందితులను కనుగొనడానికి మేము వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం" అని తెలిపారు.
బీజేపీ X టీఎంసీ
ఈ ఘటన తర్వాత బంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మహిళల భద్రతను లక్ష్యంగా చేసుకుని మమతా బెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే బీజేపీ అనవసరంగా ఈ ఘటనను రాజకీయం చేస్తోందని.. టీఎంసీ విమర్శించింది.
ఇద్దరు మహిళలపై దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాల్వియా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. "బంగాల్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మాల్దా జిల్లాలో జులై 19న ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి.. కనికరం లేకుండా కొట్టారు. మమతాబెనర్జీ హృదయం విరిగిపోయేలా ఉంది ఈ ఘటన. కానీ ఆమె మణిపుర్ ఘటనపై స్పందించింనంతలా సొంత రాష్ట్రంలో జరిగిన దారుణంపై నోరు విప్పలేదు. బంగాల్ ముఖ్యమంత్రి ఆమెనే కాబట్టి ఏం పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నారేమో. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని వైఫల్యాలను బహిర్గతం చేసినట్టు ఉంటుందని.. కనీసం బాధను కూడా వ్యక్తం చేయలేదు" అని ఆయన ఆరోపించారు.
'బంగాల్‌లో మణిపుర్ తరహా పరిస్థితి..'
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కూడా స్పందించారు. బంగాల్‌లో మణిపుర్ తరహా పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. జులై 8న జరిగిన రూరల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఓ మహిళా బీజేపీ అభ్యర్థిని కొందరు వివస్త్రను ఊరేగించారని ఆయన ఆరోపణలు చేశారు.
'రాజకీయం చేయాల్సిన అవసరం లేదు'
బీజేపీ చేసిన ఆరోపణలపై బంగాల్ మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా స్పందించారు. "మాల్దా ఘటనను బీజేపీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అది ఓ దొంగతనం కేసు. ఇద్దరు మహిళలు మార్కెట్‌లో ఏదో దొంగిలించడానికి ప్రయత్నించారు. దీంతో కొంతమంది మహిళలు వారిద్దరిని కొట్టారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సుమోటోగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు" అని ఆమె తెలిపారు. మాల్దా ఘటనను మణిపుర్‌తో పోల్చవద్దని సీపీఐ నేత బృందా కారత్ కోరారు. బంగాల్‌లో ఆదివాసీ మహిళలపై పలువురు మహిళలు దాడి చేయడం బాధాకరమని అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.