High Court Dismissed GO No 1: జీవో 1 విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రహదారులపై అన్ని రకాల సభలు, సమావేశాలను నిషేధించే జీవో 1ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఆ జీవో చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు 43 పేజీల సంచలన తీర్పు ఇచ్చింది. పోలీసు చట్ట నిబంధనలను నీరుగార్చేలా జీవో ఉందని స్పష్టం చేసింది. ఈ జీవో ద్వారా దిగువస్థాయి అధికారులు సమావేశాలకు అనుమతిచ్చే విషయంలో వారి విచక్షణను వినియోగించే అవకాశం లేకుండా చేశారని తేల్చిచెప్పింది.
అరుదైన, ప్రత్యేక సందర్భాలేంటో వివరించడంలో ప్రభుత్వం విఫలమైంది: జీవో నెంబర్ వన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారులపై ప్రయాణానికి అవరోధం కలిగిస్తే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి సభలు, సమావేశాలకు అనుమతులివ్వకపోవడం సబబని జీవోలో ప్రస్తావించారని... కేవలం అరుదైన, ప్రత్యేక సందర్భాల్లోనే అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అందులో పేర్కొన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ అరుదైన, ప్రత్యేక సందర్భాలేంటో వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. అనుమతులు నిరాకరించే విషయంలో అధికారులకు ఏకపక్ష అధికారాలు కల్పించారని.... ఈ ఉత్తర్వులతో.. కిందిస్థాయి అధికారులు వారి విచక్షణను వాడే అవకాశం లేకుండా చేసినట్లయిందని స్పష్టంచేసింది.
సొంత నిర్ణయానికి అవకాశం లేకుండా చేస్తోంది: ఈ ఉత్తర్వులు రహదారులు, వీధుల్లో అనుమతులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ప్రదేశాలను సూచించాలని ఆదేశించినట్లున్నాయని వ్యాఖ్యనించింది. అధికారుల విచక్షణ మేరకు అనుమతులివ్వాలని పోలీసు చట్టంలో నిర్దేశించారని.. జీవో 1 అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉందని తీర్పులో వెల్లడించింది. జీవో 1 ద్వారా చట్ట నిబంధనలను నీరుగార్చి అధికారాలను నియంత్రణలోకి తీసుకోవడమే అవుతుందని పేర్కొంది. సమావేశాలు, ఊరేగింపుల వల్ల రహదారులపై ట్రాఫిక్‌కు అవరోధం కలుగుతుందని స్థానిక అధికారి భావించినప్పుడే పోలీసు చట్టం సెక్షన్ 30(2) ప్రకారం ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరాలి. ప్రతి కేసునూ స్థానిక అధికారి సొంత విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకోవాలని చట్టం చెబుతోందని.... ప్రజాశాంతికి విఘాతం కలుగుతుందని నిర్ణయానికి వచ్చాకే అనుమతి తీసుకోవాలని కోరవచ్చని తెలిపింది. అధికారులు విచక్షణాధికారాన్ని వినియోగించుకునే అవకాశం లేకుండా జీవో 1 చేస్తోందని.... ఫలానా విధంగా అనుసరించండి అనేలా జీవో నిర్దేశిస్తోందని స్పష్టంచేసింది.
ప్రమాదం సాకుతో సమావేశాల హక్కును కాలరాయడం సరికాదు:ఒకచోట జరిగిన ప్రమాదాన్ని సాకుగా చూపి ప్రతిచోటా సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించే హక్కును కాలరాయడం సరికాదన్న హైకోర్టు.... జరిగిన ప్రమాదానికి కారణాలేంటో విశ్లేషించి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేగానీ రహదారులపై సమావేశాలకు అనుమతులపై స్థానిక అధికారుల విచక్షణను తీసేయడం సరికాదంది. ప్రమాదాల నివారణ పేరుతో వ్యక్తులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛపై ఆంక్షలు విధించేలా జీవో 1 తీసుకురావాల్సిన అవసరం లేదని.... వ్యక్తులు, పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాల విషయంలో జీవోలో పేర్కొన్న ఆంక్షలు సహేతుకంగా లేవని పేర్కొంది. జీవో నెంబర్ వన్‌లో షరతులు చాలా తీవ్రంగా ఉన్నాయంది.