ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kidnapping of a toddler : ఇంటి స్థలం ఇప్పిస్తామని నమ్మించి.. పసిబిడ్డను కిడ్నాప్ చేసిన మాయ లేడీ

By

Published : May 19, 2023, 11:36 AM IST

కిడ్నాప్ కలకలం

Kidnapping of a toddler : ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో నాలుగు నెలల పసిబిడ్డ కిడ్నాప్ స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ హనుమాన్ పేటలో ఫుట్ పాత్ పై నివసిస్తున్న భార్యాభర్తలు ముద్దాని రాముడు, కోటమ్మ చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్నారు.‌ బుధవారం రాత్రి కోటమ్మకు ఓ గుర్తు తెలియని మహిళ పరిచయమైంది. రేషన్ కార్డు, ఇళ్ల స్థలం ఇప్పిస్తానని నమ్మబలికింది. వీటి కోసం తనతో కలిసి రావాలని కోరింది. దీంతో కోటమ్మ ఆ మహిళను నమ్మింది. గురువారం హనుమాన్ పేట నుంచి కోటమ్మ నాలుగు నెలల బిడ్డ జాన్ పాల్ ను తీసుకొని ఆ మహిళతో కలిసి ఆటోలో మార్కెట్ వరకు వచ్చింది. అక్కడి నుంచి మరో ఆటోలో గొల్లపూడి వచ్చారు. అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, అక్కడి నుంచి కొండపల్లి ఖిల్లా రోడ్డు వరకు ఆ గుర్తు తెలియని మహిళ ఆటోలు మార్చిమార్చి తీసుకొచ్చింది. కొండపల్లి ఖిల్లా రోడ్డు సెంటర్ లో వేచి ఉన్న వీరి వద్దకు బైక్ పై గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. గుర్తు తెలియని మహిళ తన సోదరి అని దగ్గరలో పనిచూసుకొని కొద్ది సేపటిలో వస్తాం... అప్పటి వరకు వేచి ఉండమని కోటమ్మకు చెప్పాడు. బాబు ఏడవకుండా తీసుకెళ్లి తీసుకొస్తామని నమ్మబలికారు. కోటమ్మ దగ్గర ఉన్న బ్యాంకు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, పసిబిడ్డ జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు బిడ్డను తీసుకొని బైక్ పై వెళ్లిపోయారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కోటమ్మ పరిసర ప్రాంతాల్లో వెతికింది. గుర్తు తెలియని వ్యక్తుల ఆచూకీ లభించకపోవడంతో సాయంత్రం ఆమె భర్తతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు పసిబిడ్డ ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఐ పి.శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details