ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇసుక అక్రమ రవాణాను ఆపాలంటూ దేవినేని ఉమ నిరసన - అరెస్టు చేసిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 3:56 PM IST

devineni_uma_protests_on_illegal_sand_transport

TDP Leader Devineni Uma Protests on Illegal Sand Transport: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పెట్రేగిపోతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే ఆపాలంటూ.. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్దనున్న ఫెర్రీ ఘాట్ వద్ద, లాంచీల రేవు వద్ద టీడీపీ కౌన్సిలర్లు, జనసేన పార్టీ నేతలతో కలిసి ఆయన ఇసుక డంప్‌పై బైఠాయించి నిరసన తెలిపారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తోన్న వైసీపీ దొంగలపై పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున చేరుకుని మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్ట్ చేశారు.

Devineni Uma Comments:''ఇబ్రహీంపట్నం వద్ద జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను వెంటనే ఆపాలి. ఫెర్రీ ఘాట్ వద్ద, లాంచీల రేవు వద్ద యథేచ్చగా ఇసుక రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదు. అక్రమ ఇసుక తవ్వకాలతో వచ్చిన వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ఖజానాకు వెళ్లాయి. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకోవాలి. ఇసుక రవాణాకు సంబంధించి.. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డికి ఫోన్ చేసి వీడియోలు, ఫోటోలు చూపించాను. ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన వందల కోట్ల రూపాయలు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. ఇసుక కాంట్రాక్ట్ కాలపరిమితి మే నెలలోనే ముగిసింది. గత ఆరు నెలలుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నా.. గనుల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు..?.'' అని టీడీపీ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details