ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సమ్మె విరమించండి, లేదంటే చర్యలు తీసుకుంటాం - అంగన్వాడీలకు ప్రభుత్వం హెచ్చరిక

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 9:34 AM IST

government_tell_anganwadi_problems_be_solved

Government Tell Anganwadi Problems Be Resolved: అంగన్వాడీలు సమ్మెను విరమించుకోవాలని, లేకుంటే విధులకు గైర్హాజరైనట్లుగా భావించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అంగన్వాడీలు, సహాయకులు ప్రస్తావించిన వివిధ అంశాలను సానుకూలంగా పరిశీలించినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. సంబంధిత యూనియన్లతో విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు బెనిఫిట్‌ను తమ సర్వీసు చివరినాటికి ఇప్పుడున్న 50వేల నుంచి లక్షకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హెల్పర్లకూ 20 వేల నుంచి 40వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 

పదోన్నతి కోసం గరిష్ఠ వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించారు. అంగన్వాడీ కార్యకర్తలకు టీఏ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విడుదలచేయడానికి ప్రభుత్వం నిశ్చయించిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయించిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమ్మె కారణంగా అత్యంత అణగారిన వర్గాలకు చెందిన బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని ఈ నేపథ్యంలో సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details