ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శింగనమలలో మద్యం సేవించి కానిస్టేబుల్​ వీరంగం - సస్పెండ్​ చేసిన అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2023, 4:54 PM IST

singanamala police station

Constable Suspended in Singanamala: అనంతపురం జిల్లాలోని శింగనమల పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్​ను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రాత్రి కానిస్టేబుల్​ మద్యం సేవించి పోలీస్​ స్టేషన్​ ఎదురుగా వీరంగం సృష్టించాడని స్థానికులు అంటున్నారు. అంతటితో ఆగకుండా మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ, బెదిరింపులకు గురి చేశాడన్నారు.

స్థానికుల వివరాల ప్రకారం అనంతపురం జిల్లా శింగనమల పోలీస్‌స్టేషన్‌లో షబ్బీర్‌ అనే కానిస్టేబుల్‌ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడన్నారు. అంతేకాకుండా ఓ మహిళతోపాటు, స్థానికులను అసభ్య పదజాలంతో దూషించాడని వివరించారు. అంతటితో ఆగకుండా వారిపై రాళ్లతో దాడికి యత్నించాడని, తోటి సిబ్బంది ఆయన్ను స్టేషను లోపలికి తీసుకెళ్తున్నా మళ్లీ బయటకు వచ్చి బూతులు తిట్టాడని వాపోయారు. దాదాపు అరగంటపాటు రచ్చరచ్చ చేశాడని వివరించారు. బాధితులు సీఐకి ఫోన్‌ చేస్తామని చెప్పినా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి భయపడేదే లేదన్నాడని తెలిపారు. మీ అంతు చూస్తానని భయాందోళనకు గురి చేశాడని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే మద్యం తాగి విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడితే, తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులు 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు స్థానిక పోలీసు స్టేషన్​ నుంచి వివరాలు ఆరా తీశారు. ఈ క్రమంలో డీఎస్పీ వెంకట శివారెడ్డి విచారణ చేపట్టి వివరాలను ఎస్పీకి అందించారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ షబ్బీర్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ అన్బురాజన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details