ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివేకా హత్య కేసు: వేగం పెంచిన సీబీఐ.. మరికొందరు 'కీలక' వ్యక్తులకు నోటీసులిచ్చే అవకాశం

By

Published : Feb 4, 2023, 7:02 AM IST

Updated : Feb 4, 2023, 1:00 PM IST

YS Vivekananda Reddy Murder : మాజీమంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంటుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ వెంట, ఇంట పనిచేసే ఇద్దరు కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు ఆరున్నర గంటలకు పైగా ప్రశ్నించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఫోన్‌కాల్‌ డేటా ఆధారంగా సీఎం జగన్ ఓఎస్​డీ కృష్ణమోహన్‌ రెడ్డితో పాటు, సీఎం ఇంట్లో పనిచేసే నవీన్‌ను విచారించారు. అంతేకాకుండా నేడు మరికొందరిని విచారించే అవకాశం ఉంది. ఈనెల 10 లోగా కేసు విచారణ ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు సీబీఐ దర్యాప్తులో వేగం పెంచినట్లు సమాచారం.

YS Vivekananda Reddy Murder
వివేకా హత్య కేసు

Viveka Murder Case CBI Inquiry : వివేకా హత్య కేసులో మలిదశ విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన అధికారులు కేసులో కీలక వ్యక్తులను విచారించే దిశగా అడుగులు వేస్తున్నారు. అవినాష్‌రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు హత్య జరిగిన రోజు ఎంపీ ఫోన్‌ నుంచి సీఎం జగన్‌, భారతి వద్ద పనిచేసే కీలక వ్యక్తులకు తరుచూ ఫోన్‌కాల్స్ వెళ్లినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. దీంతో సీఎం ఓఎస్​డీ కృష్ణమోహన్‌రెడ్డిని , భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్‌ను విచారణకు పిలిచిన అధికారులు దాదాపు ఆరున్నర గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. హత్య జరిగిన రోజు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఆ ఫోన్ ఎవరికివ్వమన్నారు? మీరు ఎవరికిచ్చారంటూ గుచ్చిగుచ్చి అడిగారు.

సీఎం జగన్‌తోపాటు ఆయన భార్య భారతితో మాట్లాడించారా అని ఆరా తీశారు. అవినాష్‌ వారితో ఎంతసేపు మాట్లాడారని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి కాకుండా ఆరోజు ఇంకెవరెవరు ఫోన్‌ చేశారని విచారణ సందర్భంగా అధికారులు అడిగారు. వారు చెప్పిన సమాధానాల్లో తేడాలు ఉన్నప్పుడల్లా తమ వద్ద ఉన్న కాల్‌డేటా ఆధారాలు చూపి ప్రశ్నించినట్లు తెలిసింది.

అవినాష్‌రెడ్డి తొలుత కాల్‌ చేసిన వెంటనే వివేకా చనిపోయినట్లు మీకు చెప్పారా? చెబితే ఆయన ఎలా చనిపోయారని చెప్పారని.. సీబీఐ అధికారులు ప్రశ్నించారని సమాచారం. అవినాష్‌రెడ్డి ఫోన్‌కాల్‌ తర్వాత జగన్, భారతిల స్పందన ఏంటని విచారించారు. ఆ కాల్‌ వచ్చిన తర్వాత ఆక్కడ ఏయే పర్యవసనాలు చోటుచేసుకున్నాయని ఆరా తీసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక మంది అనుమానితులను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఇప్పుడు ఏకంగా సీఎం జగన్‌, ఆయన భార్య భారతి వద్ద పనిచేసే కీలక వ్యక్తులను విచారించి వివరాలు రాబట్టడం సంచలనంగా మారింది.

వీరిచ్చిన సమాచారం మేరకు త్వరలోనే మరికొందరు కీలక వ్యక్తులకు నోటీసులిచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవినాష్‌రెడ్డి నుంచి తొలికాల్ వచ్చినప్పటి నుంచీ ఆరోజు జరిగిన పరిణామాలన్నింటి పైనా సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ సందర్భంగా కడప కేంద్ర కారాగారం వద్ద పోలీసులు, నిఘా విభాగం సిబ్బంది పదుల సంఖ్యలో ఉన్నారు. సీబీఐ విచారణ ముగిసిన అనంతరం కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ ఇద్దరూ సీఎస్ జవహర్‌రెడ్డితో కలిసి ఆయన వాహనంలోనే తిరుపతి వైపు వెళ్లారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన జవహర్‌రెడ్డి సాయంత్రం కేంద్రకారాగారం వద్దకు వచ్చారు. విచారణ ముగించుకుని బయటకు వచ్చిన కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ ఆయన వాహనంలోనే ఎక్కి వెళ్లడం సంచనలంగా మారింది.

వివేకా హత్య కేసు

ఇవీ చదవండి :

Last Updated : Feb 4, 2023, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details