ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలపై కేసుల ఎత్తివేత

By

Published : Jan 29, 2021, 8:28 AM IST

వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఊరట లభించింది. చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును.. రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మిథున్‌రెడ్డిపై సదుం పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన మరో కేసునూ ఉపసంహరించుకోవటంతో.. ఎంపీపై ఉన్న అన్ని కేసులూ తొలగించినట్లైంది.

Dismissal of cases against ycp leaders Mithun Reddy and Chevireddy
మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలపై కేసుల ఎత్తివేత

కడప జిల్లా రాజంపేట వైకాపా ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభా పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలపై చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును.. రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మిథున్‌రెడ్డిపై సదుం పోలీసుస్టేషన్‌ పరిధిలో నమోదైన మరో కేసునూ ఉపసంహరించుకుంది. ఆయనపై గతంలోనే ఓ కేసు ఎత్తివేయగా.. తాజాగా మరో రెండు ఉపసంహరించుకోవడంతో ఎంపీపై ఉన్న అన్ని కేసులూ తొలగించినట్లైంది. ఈ కేసుల ఎత్తివేతకు గతేడాది సెప్టెంబరు 2, నవంబరు 20 తేదీల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రభుత్వానికి వేర్వేరుగా ప్రతిపాదనలను పంపించారు. ఈ మేరకు నిందితులపై విచారణ ఉపసంహరించుకునేలా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో కోర్టులో పిటిషన్‌ వేయించాలని డీజీపీని ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులిచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులపై విజయవాడలోని రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తుతం ఇవి విచారణలో ఉన్నాయి.

ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు లేకుండా ఉత్తర్వులు

  • రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా మేనేజరుగా పని చేస్తున్న ఎస్‌.రాజశేఖర్‌పై దౌర్జన్యానికి పాల్పడి, చెంపదెబ్బ కొట్టారన్న అభియోగంపై ఏర్పేడు పోలీసుస్టేషన్‌ పరిధిలో 2015లో కేసు నమోదైంది. తాజాగా దీన్ని ఎత్తేస్తూ జీవో ఇచ్చిన ప్రభుత్వం.. అందులో నిందితులుగా ఉన్న మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి పేర్లను ప్రస్తావించలేదు. విరూపాక్ష జయచంద్రారెడ్డి సహా మరో 18 మంది ఇతరులపై ఉన్న కేసును ఎత్తేస్తున్నట్లు పేర్కొంది.
  • ఎంవీ కృష్ణారెడ్డి అనే వ్యక్తితో పాటు మరో నలుగురు వెళ్తున్న వాహనాన్ని అడ్డగించి, వారిని గాయపరిచి, కారును ధ్వంసం చేశారన్న అభియోగంపై సదుం పోలీసుస్టేషన్‌లో మిథున్‌రెడ్డిపై 2009లో మరో కేసు నమోదైంది. దీన్ని తొలగించిన ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లోనూ మిథున్‌రెడ్డి పేరు పేర్కొనలేదు. మొదటి నలుగురు నిందితులనే ప్రస్తావించింది.
  • ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి అక్రమ చొరబాటుకు పాల్పడ్డారనే అభియోగంతో 2015లో మిథున్‌రెడ్డిపై కేసు పెట్టారు. ఇందులో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా నిందితుడు. ఈ కేసును గతేడాది ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మిథున్‌రెడ్డి సమర్పించిన అఫిడవిట్‌లో ఈ మూడు కేసుల వివరాలను ప్రస్తావించారు. ప్రస్తుతం అవన్నీ తొలగిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details