ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి జగన్‌ సర్కార్ మరో ప్రణాళిక..

By

Published : Nov 28, 2022, 7:33 AM IST

Updated : Nov 28, 2022, 10:36 AM IST

New Plan For Construction Of Irrigation Projects: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి జగన్‌ సర్కారు రూపొందించిన.. తొలి ప్రణాళికలేవీ ఫలించలేదు. వాటికి అవసరమైన నిధుల్లో 25 శాతం కూడా వెచ్చించకపోవడంతో పూర్తిగా పడకేశాయి. ఇప్పుడు పాత ప్రణాళికలను పక్కనబెట్టి.. ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను విభజించి, ఎంతమేర నిధులు అవసరమో సమాచారం సేకరిస్తోంది.

Irrigation Projects
సాగునీటి ప్రాజెక్టులు

New Plan For Construction Of Irrigation Projects: సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ సంవత్సరం ఏది పూర్తిచేయాలన్న దానిపై జగన్‌ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామంటూ 2019 నవంబరులో ఒకసారి, 2020 సెప్టెంబర్‌లో మరోసారి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు.. వాటిపై సీఎం జగన్‌ వద్ద చర్చించారు. ఈ ప్రణాళికలు కొలిక్కి రాకపోగా, అప్పటికే 80 శాతం నిర్మాణం పూర్తయిన సంగం, నెల్లూరు బ్యారేజీలను జాతికి అంకితం చేశారు.

ఈ ప్రభుత్వానికి ఇక ఏడాదిన్నర గడువే ఉంది. అసలు ప్రాజెక్టుల పూర్తికి ఎలా ముందుకెళ్లాలనే విషయంలో మళ్లీ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇకపై 75 శాతం పనులు పూర్తయిన వాటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా కసరత్తు సాగుతోంది. ఇందుకోసం ప్రాజెక్టులను 4 కేటగిరీలుగా విభజించి సమాచారం సేకరిస్తున్నారు. 50 శాతం కంటే తక్కువ పని జరిగినవి, 50 నుంచి 75 శాతం మధ్య పూర్తయినవి, 75 శాతం దాటి పూర్తయినవి, దాదాపు 100 శాతం పనులు కొలిక్కి వచ్చినవిగా ప్రాజెక్టులను విభజించారు. వీటన్నింటికీ ఇంకా ఎంత మొత్తం అవసరమనే సమాచారం సేకరిస్తున్నారు.

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కొత్త ప్రణాళికలు

జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. ప్రాజెక్టులపై గత ప్రభుత్వ ప్రణాళికలను పక్కన పెట్టింది. కొత్తగా టెండర్లు పిలిచి 20 శాతం లోపు పనులు పూర్తయిన వాటిని రద్దు చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించి, అవసరమైన కొన్నింటినే కొనసాగించాలని తీర్మానించింది. ఆ తర్వాత అనేక కొత్త ప్రాజెక్టులకు ప్రభుత్వం పాలనామోదం ఇచ్చి టెండర్లు పిలిచింది. కృష్ణా వరద జలాలను రాయలసీమ జిల్లాలకు తక్కువ రోజుల్లోనే ఎక్కువగా మళ్లించాలనే ఆలోచనతో ప్రారంభించిన "సీమ కరవు నివారణ పథకం" అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. పాత, కొత్త ప్రాజెక్టులు పడకేశాయి. పెద్ద పెద్ద గుత్తేదారులు కూడా చేతులెత్తేశారు.

సాగునీటి ప్రాజెక్టులపై 2019 నవంబర్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం.. నిర్మాణంలో ఉన్నవి, కొత్తవి, పోలవరం సహా మొత్తం ప్రాజెక్టుల పూర్తికి లక్షా 64 వేల 815 కోట్లు అవసరమని తేల్చారు. అందులో పోలవరంలో +41.15 మీటర్ల స్థాయికే నీళ్లు నిలబెడితే.. అన్నింటికీ కలిపి లక్షా 41వేల 499 కోట్లు కావాలని లెక్కించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ప్రాధమ్యాల వారీగా వర్గీకరించారు.

తొలి ప్రాధాన్యంలో మళ్లీ రెండుగా విభజించారు. ఏయే ప్రాధాన్య ప్రాజెక్టులకు, ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయిస్తే 2024 నాటికి పూర్తిచేయగలరో ప్రణాళిక సిద్ధం చేశారు. మళ్లీ 2020 సెప్టెంబర్లో సీఎం జగన్‌ వద్ద ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి ప్రణాళికను కొలిక్కి తెచ్చారు. వెయ్యి 78 కోట్లు ఖర్చు చేస్తే 5 ప్రాజెక్టులను 2020-21 నాటికి పూర్తి చేయవచ్చని నిర్ణయించారు. పాత, కొత్తగా టెండర్లు పిలిచేవి కలిపి 54 ప్రాజెక్టులకు ప్రణాళిక సిద్ధం చేశారు. 15వేల 85 కోట్లతో 19 ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యంగా పూర్తిచేయాలని అనుకున్నారు. 2020లో మూడు, 2021లో అయిదు, 2022లో ఏడు, 2024లో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చని అంచనా వేశారు.

రెండో ప్రాధాన్యం కింద 11 వందల 4 కోట్లు ఖర్చు చేసి, 9ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని లెక్కలు గట్టారు. వాటిలో చాలా ప్రాజెక్టుల అంచనాలు ఇప్పుడు పెరిగిపోయాయి. 4వేల 155 కోట్లతో 14 ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చని లెక్కించారు. ఈ ప్రణాళికలు ఫలించేలా ప్రభుత్వం నిధులు ఇవ్వలేకపోయింది. ఇవి కాకుండా కొత్త ప్రాజెక్టులకు 72వేల 458 కోట్లు అవసరమని.. అందుకోసం రుణాలు తీసుకోవాలని భావించారు. ఈ రెండు విభాగాల్లోనూ పోలవరం ప్రాజెక్టు లేదు. అనుకున్న వాటిలో ఏదీ సాకారం కాలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details