ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు

By

Published : Oct 12, 2020, 9:21 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడన ప్రభావంతో... విజయనగరం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు పంటలు నీట మునిగాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి, కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.

heavy rains in vizianagaram district
అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో వర్షాలు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 11.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తవలస మండలంలో అత్యధికంగా 47, భోగాపురంలో 38.6, జామిలో 27.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీరప్రాంతాల్లో అలల తాకిడి పెరిగింది. 26వ జాతీయ రహదారి కోతకు గురైంది.

ఎడతెరిపి లేని వర్షాలకు సుమారు 50 ఎక‌రాల్లో మొక్కజొన్న, 3,250 హెక్టార్ల‌లో పత్తి పంటకు న‌ష్టం వాటిల్లింది. వాయుగుండంతో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండ‌టంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశించారు. వాయుగుండం తీరం దాటే సమయంలో 60కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మ‌త్స్య‌కారులు స‌ముద్రంలో చేప‌ల‌వేట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్లు తెలిపారు. మ‌త్స్య‌కార గ్రామాల్లో దండోరా వేయించ‌డంతోపాటు, స‌చివాల‌య సిబ్బందిని కూడా అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు.

వర్షాలపై జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే (08922-236947, 9885367237) ఈ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అన్ని మండ‌లాల్లోని తహశీల్దార్ కార్యాల‌యాల్లోనూ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి.

భారీ వర్షాలపై అధికారుల అప్రమత్తత

ABOUT THE AUTHOR

...view details