ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan హవ్వ..! అది నోరేనా జగన్​?.. ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరోమాట!

By

Published : May 4, 2023, 7:06 AM IST

CM Jagan Comments on Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వ్యవహారంలో సీఎం జగన్‌ నాలుక మడతేసిన తీరు చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ప్రతిపక్షనేతగా అడ్డగోలు ఆరోపణలు చేసి, అసలు ఇది అవసరమా అని ప్రశ్నించారు. ఇప్పుడు అదే రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందంటున్నారు. ప్రాజెక్టు ముందుకు సాగనీయకుండా అడుగడుగునా మోకాలడ్డుతూ రాజకీయంగా పబ్బం గడిపిన జగన్‌ …ఇప్పుడు ప్రతిపక్షాలు జీర్ణించుకోవట్లేదని నీతులు వల్లెవేస్తున్నారు. కోర్టుల్లో కేసులు వేసైనా ప్రాజెక్టును అడ్డుకుంటామని ప్రతిపక్షనేతగా ప్రకటించిన జగన్‌.. ఇప్పుడు కేసులన్నీ పరిష్కరించుకుని మరీ భూసేకరణ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. జగన్‌ నాటి-నేటి మాటల వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. రాజకీయం కోసం మరీ ఇంత అసత్య ఆరోపణలు చేస్తారా.. అసలు అది నోరేనా! అని జనం ప్రశ్నిస్తున్నారు.

CM Jagan Comments on Bhogapuram Airport
CM Jagan Comments on Bhogapuram Airport

CM Jagan Comments on Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేత హోదాలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన జగన్‌.. బుధవారం అదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. అప్పుడు, ఇప్పుడు జగన్‌ ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. విమానాశ్రయం కోసం బలవంతంగా తీసుకున్న భూముల్ని వైసీపీ అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని జగన్‌ చెప్పారు... మరి ఆయన ఇప్పుడు ఆయన ప్రభుత్వమే బలవంతంగా భూములు లాక్కొంది కదా అని జనం ప్రశ్నిస్తున్నారు. కోర్టుకు వెళ్లి భూ సేకరణను అడ్డుకుంటామని అప్పట్లో చెప్పారు.. మరి ఇప్పుడు కొందరు బాధితులు వారి హక్కుల కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే వారిపై సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారెందుకని నిలదీస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారే... మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ చర్యల వల్ల అన్యాయమైపోయిన వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

అప్పుడేమో భోగాపురం.. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉందంటారా? ఇప్పుడు అదే భోగాపురం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సమానదూరంలో ఉందని చెబుతారా? ఇదే సూత్రం రాజధాని అమరావతికి ఎందుకు వర్తించదు అన్న ప్రశ్న జనం నుంచి వినిపిస్తోంది. చెన్నై విమానాశ్రయం ఒక వెయ్యి 2వందల 83 ఎకరాల్లో, కొచ్చిన్‌ విమానాశ్రయం 8వందల ఎకరాల్లో ఉందని అప్పుడన్న మీరు.. మరి ఇప్పుడు ఏకంగా 2వేల 203 ఎకరాల్లో భోగాపురం ఎయిర్​పోర్టు నిర్మాణానికి ఎలా శంకుస్థాపన చేశారు? అంటే వేరేవాళ్లు అభివృద్ధి చేస్తే దానిపై ఆరోపణలు చేసి అడ్డుకోవటమే కదా! అని జనం నిలదీస్తున్నారు.

విశాఖ విమానాశ్రయం పక్కనే భూమి ఉన్నప్పుడు కొత్త చోట విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఏముందని అప్పట్లో ప్రశ్నించారే.. అప్పుడు వద్దన్న కొత్తచోటే ఇప్పుడు ఎలా ముద్దు అయ్యింది? అని నిలదీస్తున్నారు భోగాపురం విమానాశ్రయం దిక్కుమాలిన ఆలోచన అని అప్పట్లో చెప్పి ఇప్పుడు ‘భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన నేనే చేస్తున్నా.. మరో మూడేళ్ల తర్వాత ప్రారంభమూ నేనే చేస్తా’ అని ఎలా చెప్పారు అని ప్రశ్నిస్తున్నారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్‌జీటీల్లో వేసిన కేసులన్నీ పరిష్కరించుకుని మరీ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశామని ఇప్పుడు చెబుతున్నారే.. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులో కేసులు వేసి మరీ ప్రాజెక్టును, భూసేకరణ విధానాన్ని అడ్డుకుంటామని చెప్పింది, చేసింది మీరే కదా? అని జనం ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో భోగాపురం ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేసులేసి.. అడుగడుగునా మోకాలడ్డిందీ మీరే. ఇప్పుడేమో.. టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదల్లేదు అని ప్రశ్నిస్తున్నదీ మీరే కదా అని నిలదీస్తున్నారు.

అప్పుడు మీరు అడ్డంకులు కల్పించకపోయి ఉంటే.. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు ఓ రూపురేఖ వచ్చి ఉండేది కదా! అని ప్రజలు అడుగుతున్నారు. మూడేళ్లలో భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తిచేస్తామని చెబుతున్నారే... టీడీపీ హయంలో ఈ ప్రాజెక్టుకు నాలుగేళ్ల కిందటే శంకుస్థాపన జరిగింది. మీరు అధికారం చేపట్టాక ఆ పనులు అలాగే కొనసాగేలా చేసి ఉంటే ఈ ప్రాజెక్టు తొలిదశ ఈపాటికే పూర్తయ్యుండేది కదా! మరి దాన్ని ఎందుకు అడ్డుకున్నారు? ఈ నష్టానికి బాధ్యులు మీరు కాదా? అని నిలదీస్తున్నారు.

అప్పటి టీడీపీ నేతల భూములను సేకరణ నుంచి తప్పించేలా, పేదల భూములు లాక్కునేలా ఎలైన్‌మెంట్‌ మార్చారని ఆరోపించారే.. మరి అదే అవంతి శ్రీనివాసరావుకు వైసీపీ టికెట్‌ ఎలా ఇచ్చారు? ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రిగా కూడా తీసుకున్నారు. అవంతి శ్రీనివాసరావును చంద్రబాబు బినామీ అని అప్పట్లో ఆరోపించారే.. మరి ఇప్పుడు ఆయన ఎవరి బినామీ? అవంతి ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి.. ఆయన భూములు సేకరణ పరిధిలోకి రాకుండా చూశారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. గతంలో కేంద్రానికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పంపిన నివేదికను ఆమోదింపజేసుకోవాల్సింది కదా.. మరి దాన్ని పక్కనపెట్టేసి.. మీరెందుకు భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు? అంటే వేరే పార్టీ చేస్తే తప్పు.. అదే పని మీరు చేస్తే మాత్రం ఒప్పా అని నిలదీస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)పై అంతలా ప్రేమ ఒలకబోసిన మీరు.. అధికారంలోకి వచ్చాక అదే సంస్థకు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ బాధ్యతలు అప్పగించాల్సింది కదా! మరి అలా ఎందుకు చేయలేదు? అని జనం ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో జీఎంఆర్‌ గ్రూపునకు భోగాపురం విమానాశ్రయం టెండర్లు నిర్మాణం దక్కాయి. దీనిపైనా ఆరోపణలు చేసిన మీరు.. ఇప్పుడు అదే సంస్థకు ఈ ప్రాజెక్టు అప్పగించటం వెనక కారణం ఏంటి? తాజాగా టెండర్లు ఎందుకు పిలవలేదు? అప్పటి టెండర్లనే మళ్లీ ఎందుకు ఖరారు చేశారు? అని నిలదీస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details