ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంక్రాంతికి సరుకులిస్తామన్నారు.. ఇప్పుడేమో కుచ్చుటోపి పెట్టారు..!

By

Published : Jan 7, 2023, 7:27 AM IST

Updated : Jan 7, 2023, 9:57 AM IST

Chit Scam in Vizianagaram: సంక్రాంతి పండుగకు పిండివంటలు చేసుకుని ఇంటిల్లపాది సంతోషంగా గడిపేందుకు పైసాపైసా కూడబెట్టి పప్పుల చిట్టీ కట్టారు. వాలంటీర్ ఉన్నారు.. డబ్బుకు డోకా లేదన్నారు. సమయం దగ్గర పడ్డాకా, చేతులెత్తేశారు. ఇచ్చిన సొమ్ముకు సరుకులు ఇవ్వాలని అడిగితే పత్తా లేకుండా పారిపోయారు. నెలనెలా వాయిదాలు కట్టించుకుని 8కోట్ల రూపాయలకుపైగా వసూలుచేసి ఉడాయించిన నిర్వాహకులపై.. పోలీసుల చర్యలు తూ తూ మంత్రంగానే ఉన్నాయి. మధ్యవర్తులుగా ఉన్న ఏజెంట్లు తమకు ఆత్మహత్యలే శరణ్యమని బావురమంటున్నారు.

chit scam
పప్పుల చీటి

Chit Scam in Vizianagaram: విజయనగరం జిల్లాలో పేద ప్రజలకు సంక్రాంతి పండుగ ఆనందం లేకుండా చేశారు పప్పుల చిట్టీ నిర్వాహకులు. నెలనెల వాయిదా పద్దతిలో డబ్బులు కూడబెడితే.. సంక్రాంతి పండుగకు సరుకులు అందిస్తామని నమ్మబలికి కోట్లాది రూపాయలతో ఉడాయించారు. విజయనగరం మండలం కొండకరకం గ్రామానికి చెందిన మజ్జి అప్పలరాజు, మజ్జి రమేశ్‌తోపాటు ఎస్ఎస్ఆర్ పేటకు చెందిన వాలంటీర్‌ పతివాడ శ్రీలేఖ కలిసి ఏఆర్ బెనిఫిట్ ఫుడ్ పేరిట పప్పుల చిట్టీ ప్రారంభించారు. నెలకు 300 చొప్పున ఏడాదికి 3వేల 600 కడితే.. సంక్రాంతి పండుగకు 4వేల 500 విలువైన నిత్యవసర సరుకులు అందిస్తామని ప్రచారం చేశారు. తెలిసిన వాళ్లందరిని చిట్టీలు కట్టేలా ప్రొత్సహించారు. జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఒక్కో కార్డుకు వంద రూపాయలు, వంద కార్డులు దాటితే 200 రూపాయలు ఇస్తామని ఏజెంట్లకు ఆశ చూపారు. వందలాది మందిని ఏజెంట్లు ఈ స్కీంలో చేర్పించారు. నిర్ణిత గడవు ముగిసినా సరుకులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఏజెంట్లను నిలదీశారు. చిట్‌ నిర్వాహకులు డబ్బులతో ఊడాయించారని.. తామంతా మోసపోయామని లబోదిబోమంటున్నారు.

విజయనగరం జిల్లావ్యాప్తంగా 23వేల మందికి పైగా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 8 కోట్ల 37లక్షలు చిట్‌ నిర్వాహకులు వసూలు చేసినట్లు తెలిసింది. చిట్‌ నిర్వాహకులు శ్రీలేఖ, రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ప్రధాన సూత్రదారి అప్పలరాజు పరారీలో ఉన్నట్లు సమాచారం. లబ్ధిదారులు ఇళ్లమీదకు వచ్చి గొడవపడుతున్నారని ఏజెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పప్పుల చిట్టీ మోసం వెలుగులోకి వచ్చి పది రోజులవుతున్నా.. పోలీసులు కనీసం వివరాలు వెల్లడించకపోవడంపై టీడీపీ నేత కిమిడి నాగార్జున అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. చిట్టీల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసి అందించాలని బాధితులు కోరుతున్నారు.

"నేను 15 వందల 15 కార్డులు కట్టించాను. నెలకి నాలుగు లక్షల ఏబైవేల రూపాయలు.. ప్రతి నెలా కట్టాను. నా కింద కూడా ఏజెంట్లు ఉన్నారు. వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం 25 వేల కార్డులు". - ఏజెంటు

"18 వేల మంది లబ్ధిదారులు దగ్గర.. సుమారు ఒక మనిషి దగ్గర నాలుగు వేలు వసూలు చేశారు. అంటే అధికారిక లెక్కల ప్రకారం 7 నుంచి 8 కోట్ల రూపాయలు. ఇంత మంది ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. అధికారపక్షం ఎందుకు పట్టించుకోవట్లేదు. ఈ రోజు వరకూ ఎందుకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అసలు ఎవరెవరు ఇందులో ఉన్నారు". - కిమిడి నాగార్జున, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

"దీంట్లో కొంత మొత్తం ఏజెంట్లు దగ్గర ఉంది. దీనిని కోర్టుకు అందజేసి.. తరువాత బాధితులకు అందజేస్తాం". - మోహనరావు, బొబ్బిలి డీఎస్పీ

పప్పుల చిట్టీ పేరుతో కోట్ల రూపాయల మోసం

ఇవీ చదవండి:

Last Updated :Jan 7, 2023, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details