ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రామతీర్థం ఘటనపై మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి'

By

Published : Jan 1, 2021, 3:17 AM IST

Updated : Jan 1, 2021, 3:41 AM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం వద్ద శతాబ్దాలుగా కొలువై ఉన్న కోదండ రాముడి విగ్రహం ధ్వంసంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఈ దేవాలయంలో శ్రీరాముని విగ్రహ శిరస్సును ఖండించటంపై ఆందోళనలు జోరందుకున్నాయి. ప్రతిపక్షాలు మూడు రోజులుగా పోటాపోటీ నిరసనలు తెలిపాయి. మతపరమైన దాడులకు ప్రభుత్వ ఉదాసీనతే కారణమంటూ మండిపడ్డాయి.

'రామతీర్థం ఘటనపై మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి'
'రామతీర్థం ఘటనపై మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలి'

రాములవారి విగ్రహం ధ్వంసంపై భాజపా, తెదేపా నేతలతో పాటు హిందూ దార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం నిందితులను పట్టుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా దాడులను అరికట్టేలా చర్యలు చేపట్టాలని ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు.

రెండేళ్లలో సుమారు 125 దాడులు : అయ్యన్నపాత్రుడు

తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగి, పవిత్రమైన రామతీర్థం పుణ్యక్షేత్రంలో కోదండ రాముడి విగ్రహంపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్లలో సుమారు 125 దాడులు జరగడం దారుణమన్నారు.

రామతీర్థం ఘటనపై తెదేపా, భాజపా నిరసనలు

'అసలు సంగతి ఏమిటో చెప్పాలి ??'

ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి స్పందించకపోవడం వెనుక అసలు కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పర్యటనకు వచ్చినప్పడు సైతం రామతీర్థం ఘటనపై సీఎం స్పందించక పోవడం విచారకమన్నారు. పశ్చిమ బంగలో ఇదే విధంగా ఓ ఘటన జరిగితే.. అక్కడ ఉన్నతాధికారులపై కేంద్రం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఏపీలో ఆ పరిస్థితి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. ఏపీ డీజీపీపై మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని సందేహం వ్యక్తం చేశారు. తక్షణమే డీజీపీని రీకాల్ చేయాలన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం : భాజపా నేతలు

రామతీర్థం బోడికొండపై విగ్రహం ధ్వంసం జరిగిన స్థలాన్ని.. భాజపా తరపున ఎమ్మెల్సీ మాధవ్ పరిశీలించారు. జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి రాములవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ కొండ దిగువన నిరసన చేపట్టారు. రాష్ట్రంలో మత పరమైన దాడులు జరగడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 21 ఆలయాల్లో విధ్వంస చర్యలు జరగగా.. ఒక్క ఘటనలోనూ దోషులను ప్రభుత్వం అరెస్టు చేయలేదని ధ్వజమెత్తారు.

అప్పుడే చర్యలు తీసుకుని ఉండుంటే...

మొదటి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, కఠినంగా శిక్షించి ఉంటే.. ఇలాంటి దాడులు జరిగేవే కావన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రాష్ట్రంలో ఆలయాలపై దాడులకు కారణమని మాధవ్ ఆరోపించారు. జనవరి 2 నుంచి నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ధార్మిక సంస్థలతో కలసి చలో రామతీర్ధం కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

నిందితులను త్వరలోనే పట్టుకుంటాం : ఎస్పీ రాజకుమారి

కోదండ రాముడి విగ్రహం ధ్వంసం కేసును త్వరలోనే ఛేదిస్తామని విజయనగరం ఎస్పీ రాజకుమారి తెలిపారు. సీసీఎస్, క్రైం డీఎస్పీల ఆధ్వర్యంలో.. 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించామన్నారు. ఇప్పటికే కొంత కీలక సమాచారం సేకరించామని.. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనకు కారణమైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ప్రతి తీర్పు సంచలనమే.. జస్టిస్ రాకేశ్​కుమార్ 13 నెలల పయనమిదే...

Last Updated : Jan 1, 2021, 3:41 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details