ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Inter Results: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పడిపోయిన ఉత్తీర్ణతా శాతం..

By

Published : Apr 29, 2023, 9:30 AM IST

Results : నాడు-నేడు కింద రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశాం.. చదువు కోసం గతంలో ఎన్నడూ లేనంతగా ఖర్చుచేశాం.. ఇదీ ప్రభుత్వం తరుచూ చెప్పే మాటలు. కానీ పాఠ్యపుస్తకాలు, వసతి లేకుండానే కేజీబీవీల్లో ఇంటర్‌ కోర్స్‌ ప్రారంభించడంతో 34 చోట్ల సున్నాశాతం ఫలితాలు వెలువడ్డాయి.

Inter Results
Inter Results

పడిపోయిన పాస్ పర్సంటేజ్

AP Inter Results : ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ ఫలితాల విడుదల సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన ఇది..అయితే మంత్రి వ్యాఖ్యలకు..క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితాలకు ఎక్కడా పొంతన లేదు. ప్రైవేట్ రెసిడెన్షియల్‌ కళాశాలల కన్నా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ కళాశాలల్లోనే ఫలితాలు బాగున్నాయని బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ రాష్ట్రంలో 34 కేజీబీవీల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. విద్యాశాఖ మంత్రి సొంత జిల్లా విజయనగరంలోని మూడు కేజీబీవీలో ఒక్కొక్కరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అయినా సరే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం డాంభీకాలు పోయారు.

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవీల డొల్లతనం బయటపడింది. మండలానికో మహిళా జూనియర్‌ కళాశాల ఉండాలంటూ సీఎం జగన్‌ ఆదేశించడమే తరువాయి ముందూ వెనక ఆలోచించకుండా.. 292 హైస్కూల్‌ ప్లస్‌లు,131 కేజీబీవీలో ఇంటర్మీడియట్‌ కోర్సులు అధికారులు ప్రారంభించారు. కనీసం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సైతం ఇవ్వలేదు. హైస్కూల్‌ ప్లస్‌లో పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లను నియమించకుండా అక్కడే ఉన్న ఉపాధ్యాయులతో మమా అనిపించేశారు.

దీంతో దాదాపు 50శాతం పైగా హైస్కూల్‌ ప్లస్‌లో ఫలితాలు శూన్యం. 131 కేజీబీవీలకుగాను 30 కేజీబీవీల్లో ఒక్కరు కూడా పాసవ్వలేదు. మరో మూడింటిలో రెండో ఏడాదిలో సున్నా ఫలితాలు వచ్చాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 7 కేజీబీవీల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లా అయిన విజయనగరంలో 3 కేజీబీవీల్లో 64మంది పరీక్షలకు హాజరు కాగా ఒక్కొక్కరు చొప్పున పాసయ్యారు. ఉమ్మడి విజయనగరం కేజీబీవీల నుంచి 717మంది పరీక్షలు రాస్తే 48 శాతం మంది పాస్‌ కాగా.. శ్రీకాకుళం జిల్లాలో 704మంది పరీక్షలు రాస్తే 54.26శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.

ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు విద్యార్థులు మూల్యం చెల్లించుకున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ విద్యార్థినులకు పాఠాలు చెప్పేవారు లేరని, పుస్తకాలు ఇవ్వలేదని అధికారులకు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. బాలికల కోసం ప్రత్యేక కళాశాల పెట్టామని మాత్రమే చూశారు. పదో తరగతి వరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులనే ఇంటర్మీడియట్‌కు కూడా వారినే చూసుకోవాలని చెప్పారు. గత ఏడాది జూన్‌లో తరగతలు ప్రారంభమైనా.. జనవరి వరకు పాఠ్య పుస్తకాలే ఇవ్వలేదు.

కొన్నిచోట్ల పాత పుస్తకాలను సర్దుబాటు చేశారు. ఈ కళాశాలలను ప్రారంభించడంలోనే జాప్యం చేయడంతో మొత్తంగా 292 కళాశాలల్లో 3వేల444 మంది మాత్రమే ప్రవేశాలు పొందారు. వీరిలో దాదాపు సగం మంది ఉత్తీర్ణత సాధించలేదు.ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగగా...ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన బాలికల కళాశాలల్లో మాత్రం 50శాతం మించి పాసవ్వలేదు. కళాశాలను ఏర్పాటు చేసేప్పుడు భవనం ఉందా? బోధనకు అధ్యాపకులు ఉన్నారా? పాఠ్యపుస్తకాలు ఉన్నాయా? అనేదాన్ని పరిశీలించాలి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను 6 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసమే ఏర్పాటు చేయగా...అదనపు గదులు నిర్మించకుండానే ఇంటర్మీడియట్‌ ప్రారంభించారు. దీంతో ఒకే గదిలో బోధన, రాత్రిపూట నిద్రించాల్సిన దుస్థితి ఏర్పడింది.


ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details