ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మూడు రాజధానుల ఆంశంలో బయట పడిన వైఎస్సార్​సీపీ అసలు రంగు

By

Published : Feb 14, 2023, 6:53 PM IST

Updated : Feb 15, 2023, 9:20 AM IST

MINISTER BUGGANA ON AP CAPITAL: పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతున్న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. మూడు రాజధానులంటూ ఏమీ లేవని, రాష్ట్రానికి విశాఖను ఏకైక రాజధాని చేయబోతున్నామని.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. కర్నూలు న్యాయ రాజధాని కాదని, కేవలం హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్‌ మాత్రమే ఉంటుందన్నారు. అమరావతి పేరు కూడా ఉచ్చరించకుండా.. బెంగళూరులో నిర్వహించిన విశాఖ గ్లోబల్ సమ్మిట్ రోడ్డు షోలో ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టేశారు.

MINISTER BUGGANA ON AP CAPITAL
MINISTER BUGGANA ON AP CAPITAL

మూడు రాజధానుల ఆంశంలో బయట పడిన వైఎస్సార్​సీపీ అసలు రంగు

YSRCP Government On Visakha Capital : విశాఖ కార్యనిర్వాహక రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని చేస్తామని ఇన్నాళ్లూ చెబుతున్న జగన్‌ ప్రభుత్వ నైజం.. బెంగళూరు వేదికగా బయటపడింది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌కు ప్రచారం కోసం నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులన్నది అవాస్తవమని స్పష్టంచేశారు. విశాఖ ఒక్కటే రాజధాని అన్నారు. అమరావతి పేరు కూడా ఆయన నోట రాలేదు. కర్ణాటక తరహాలో ఒక సెషన్‌ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదన్న పారిశ్రామికవేత్తల ప్రశ్నకు సమాధానంగా.. రాజధాని అంశాన్ని బుగ్గన ప్రస్తావించారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాగే విశాఖను ఐటీ రంగానికి చిరునామాగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ తదుపరి రాజధానిగా విశాఖను మా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న సమాచారం పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలే కారణం. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఓడరేవు నగరంగా ఇప్పటికే గుర్తింపు ఉన్న విశాఖ.. భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అక్కడి కాస్మోపాలిటన్‌ సంస్కృతి, వాతావరణం కూడా రాజధానికి అనువుగా ఉంటాయి.

న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి అంటూ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని.. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టంచేశారు. కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌, గుంటూరులో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కర్నూలు రాజధాని కాదు. అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్‌ బెంచ్ ఉంటుంది. కర్ణాటకలోని ధార్వాడ్‌లో ఒక హైకోర్టు బెంచి, గుల్బర్గాలో మరో బెంచి ఉన్నాయి. ఇలాగే కర్నూలులో ఏర్పాటుచేస్తున్నాం. ఈ నిర్ణయానికి కారణం ఏమిటంటే.. వందేళ్ల చరిత్రను గుర్తుచేసుకోవాలి. 1937నాటి శ్రీభాగ్‌ ఒప్పందం గురించి చెప్పుకోవాలి. బ్రిటిష్‌ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. పాలనా రాజధాని ఒకచోట, కోర్టు మరోచోట ఉండాలని నిర్ణయించారు. అన్ని ప్రాంతాలకూ ప్రాధాన్యం ఉండేలా చూడాలని అప్పట్లో ఈ నిర్ణయం జరిగింది. ఆ ప్రకారమే కర్నూలులో ప్రిన్సిపల్‌ బెంచ్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం.

కర్ణాటకలో ఒక సెషన్‌ అసెంబ్లీ సమావేశాలు బెళగావిలో జరుగుతాయి. ఇందుకు కారణమేంటో అందరికీ తెలిసిందే. అదే విధంగా ఒక సెషన్‌ అసెంబ్లీ సమావేశాలు గుంటూరులో జరుగుతాయి. భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన ప్రాంతం. అది ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని.

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. రవాణా భారాన్ని తగ్గించడానికి ఇన్‌లాండ్‌ వాటర్‌పాలసీ తీసుకొస్తామన్నారు. 2029 నాటికి 10 మిలియన్‌ టన్నుల రవాణా సామర్థ్యానికి చేరతామని.. నీతిఆయోగ్‌ ప్రకటించిన పెట్టుబడులకు అనువైన వాతావరణమున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. 48 వేల 352 ఎకరాల విస్తారమైన ల్యాండ్‌బ్యాంక్‌ ఉందన్న ఆయన.. వెయ్యి కోట్లతో దక్షిణ భారతంలోనే మొదటి బల్క్‌డ్రగ్‌ పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 15, 2023, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details