ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ కేజీహెచ్‌లో అపహరణ.. శ్రీకాకుళం జిల్లాలో గుర్తించిన పోలీసులు

By

Published : Mar 18, 2022, 5:32 AM IST

విశాఖ కేజీహెచ్‌లో అపహరణకు గురైన పసికందు ఆచూకీ శ్రీకాకుళం జిల్లాలో లభ్యమైంది. పిల్లలు లేని దంపతులకు బిడ్డను అమ్మేందుకు ప్రయత్నించిన మహిళలే చిన్నారిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. పసికందును వారి నుంచి స్వాధీనం చేసుకుని కేజీహెచ్‌లో ఉన్న తల్లి చెంతకు చేర్చడంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.

CHILD KIDNAPPED
CHILD KIDNAPPED

విశాఖ కేజీహెచ్‌లో అపహరణకు గురైన పసికందు ఆచూకీని 24 గంటలు గడవకముందే పోలీసులు గుర్తించారు. చిన్నారిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. శ్రీకాకుళానికి చెందిన దంపతులకు పాపను నిందితులు విక్రయించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా వెల్లడించారు.

విశాఖ కేజీహెచ్‌లో అపహరణ.. శ్రీకాకుళం జిల్లాలో గుర్తించిన పోలీసులు

శ్రీకాకుళానికి లక్ష్మీ, రాజేష్‌ దంపతులకు 13 ఏళ్లుగా సంతానం లేకపోవడంతో బిడ్డ కావాలనుకున్నారు. కేజీహెచ్‌లో ప్రసవం కోసం చేరిన కొండమ్మ.. తనకు పుట్టబోయే బిడ్డను వారికి ఇవ్వాలనుకుంది. పురిటిలోనే బిడ్డను కోల్పోవడంతో... పక్క బెడ్‌లో ఉన్న అప్పాయమ్మకు జన్మించిన బిడ్డను వారికి అప్పగించాలని పన్నాగం పన్నింది. ఈ విషయంలో శ్రీకాకుళానికి చెందిన గాయత్రి మధ్యవర్తిగా వ్యవహరించింది. విశాఖకు చెందిన యశోధ, గీతతో కలిసి.. బిడ్డ అపహరణకు పథకం వేసింది.

సీసీటీవీ దృశ్యాలతోనే..

బిడ్డ అపహరణకు గాయత్రి మూడు రోజులుగా పథక రచన చేయగా... కొండమ్మ అందుకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. అప్పాయమ్మ బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో వైద్యులకు చూపాలనుకున్నారు. గాయత్రిని నర్సుగా పొరబడిన చిన్నారి అమ్మమ్మ.. వైద్యుడికి చూపించాల్సిందిగా బిడ్డను ఆమెకు అప్పగించింది. ఇదే అదునుగా గాయత్రి... బిడ్డతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. పాప అపహరణకు గురైందని తెలియగానే.. కేజీహెచ్‌కు చేరుకుని.. దర్యాప్తు చేపట్టామని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌లో.. నిందితులు పాపను తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. కేజీహెచ్ నుంచి ఆటోలో గాయత్రి, యశోధ... గురుద్వారా చేరుకుని.. అక్కడి నుంచి క్యాబ్‌లో శ్రీకాకుళం వెళ్లినట్లు నిర్ధరించుకున్నారు. క్యాబ్ వెనుక ఉన్న ఫోన్‌ నెంబర్ ఆధారంగా శ్రీకాకుళం జిల్లా వెళ్లి.. పాప ఆచూకీని పట్టుకున్నామని వివరించారు. దర్యాప్తులో సీసీటీవీ దృశ్యాలు కీలకపాత్ర పోషించాయని తెలిపారు.

సిబ్బంది నిర్లక్ష్యమే కారణం

తాను ఇంటికి వెళ్లి వచ్చేలోపలే పాప అపహరణకు గురైందని.. పసికందు తండ్రి చెబుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఘటనకు కారణమంటున్నారు. అపహరణకు గురైన చిన్నారి సురక్షితంగా ఒడికి చేరడంతో.. తల్లిదండ్రులు, బంధువుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఇదీ చదవండి : Baby Abducted: విశాఖ కేజీహెచ్​లో కలకలం.. నర్సులా వచ్చి..

ABOUT THE AUTHOR

...view details