ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉత్తరాంధ్ర సమస్యలపై తెదేపా పోరు.. అడ్డుకుంటున్న పోలీసులు

By

Published : Oct 28, 2022, 9:12 AM IST

TDP protests: ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాటపట్టిన తెలుగుదేశం పార్టీ .. నేడు విశాఖ రుషికొండపై అక్రమ నిర్మాణాలపై నిరసనకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం తలపెట్టిన పోరుబాటపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నేతలెవ్వరూ విశాఖ రాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగానే గృహ నిర్బంధాలు చేశారు. విశాఖలో ఉన్న నాయకుల కదలికలపైనా నిఘా ఉంచి.. వారు తమ కనుసన్నల్లోనే ఉండేలా చర్యలు చేపట్టారు.

House Arrest
గృహ నిర్బంధం

ఉత్తారంధ్ర సమస్యలపై తెదేపా నిరసనలు.. తెదేపా నేతలను గృహనిర్బంధం చేసినా పోలీసులు

TDP protests on North Andhra Issues: రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలు, దసపల్లా భూములు, పేదల స్థలాల ఆక్రమణ వంటి అంశాలపై తెలుగుదేశం నేటి నుంచి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఇవాళ విశాఖలోని ఆరు చోట్ల నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు నిరసనల్లో పాల్గొనకుండా పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖలోని తెలుగుదేశం నాయకుల కదలికలపై నిఘా ఉంచారు. గురువారం తెల్లవారుజామునే పల్లా శ్రీనివాసరావు నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరించారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపైనా పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. ఆయన ఇంటి వద్ద కాపుకాసిన పోలీసులు ఆయన ఎక్కడి వెళ్తే అక్కడికి వెంటాడారు. పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు వెళ్లినా అనుసరించారు. పోలీసుల చర్యల్ని రామకృష్ణబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి సహా ఇతర ముఖ్య నేతల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు. నిర్బంధాన్ని నిరసిస్తూ పల్లా శ్రీనివాసరావు.. గురువారం రాత్రి పార్టీ కార్యాలయంలోనే ఉండిపోయారు.

అటు ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచీ తెలుగుదేశం నేతలు విశాఖ రాకుండా.. ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను పోలీసులు అడ్డుకున్నారు. వజ్రపుకొత్తూరు మండలం రాజాం పంచాయతీలో.. బాదుడేబాదుడు కార్యక్రమంలో పాల్గొని వస్తున్న వారిని.. కాశీబుగ్గలోని అక్కుపల్లి రోడ్డు వద్ద పోలీసులు ఆపారు. ఈ క్రమంలో పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రాలో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా అంటూ తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యం నుంచి విశాఖ వెళ్లకుండా.. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ను పాడేరులో గృహనిర్బంధం చేశారు.

"ఉత్తరాంధ్రకు సంబంధించి తెలుగుదేశం నేతలను ఎవరినీ విశాఖ వెళ్లకుండా పోలీసులు హౌజ్​ అరెస్టు చేస్తున్నారు. రాజకీయాలకు ప్రాధన్యతనిస్తూ తుగ్లక్​ ముఖ్యమంత్రి పోలీసులను ఆడిస్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి కార్యక్రమాలకు మొగ్గు చూపించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉత్తరాంధ్రను దోపిడి చేసుకుంటున్నారు. మమ్మల్ని హౌస్​ అరెస్టులు చేసి ఈ రోజు ఆపినా, రేపు ఆపినా, ఎప్పిటికి ఆపినా సరే మీ తాలుక భాగోతం బయట పెట్టి రాష్ట్ర ప్రజల ముందు ఎండగడతాం". -రామ్మోహన్‌నాయుడు, ఎంపీ

ఉత్తరాంధ్ర సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంకు చెందిన తెలుగుదేశం నేతలను.. పోలీసులు గురువారం గృహ నిర్బంధం చేశారు. ఇవాళ రుషికొండపై నిరసన, శనివారం దసపల్లా భూముల వద్ద, ఆదివారం ఏజెన్సీలో గంజాయి సాగు, అమ్మకాలకు వ్యతిరేకంగా అరకు లోయలో అలాగే సోమవారం అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా పాడేరులో.. నవంబర్‌ 1న చక్కెర కర్మాగారాల మూసివేతకు వ్యతిరేకంగా అనకాపల్లిలో నిరసన తెలిపేందుకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా తెదేపా నాయకులను హౌస్‌ అరెస్టులు చేశారు. కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో తెదేపా నాయకులను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు.

విశాఖ వెళ్లేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా ఆయన విజయవాడలోని ఇంట్లోనే దీక్ష చేపట్టారు. తనను ఎందుకు నిలువరిస్తున్నారో రాతపూర్వకంగా చెప్పాలని.. వెంకన్న పోలీసులను డిమాండ్ చేశారు. తనను విశాఖ పంపేవరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. బుద్ధా వెంకన్న దీక్షకు తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details