ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగనన్న కాలనీ లే-అవుట్ భూసమీకరణపై రైతుల నిరసన.. తెదేపా మద్దతు

By

Published : Mar 27, 2022, 8:37 PM IST

విశాఖ జిల్లాలో జగనన్న కాలనీ లే-అవుట్ కోసం చేపట్టిన భూసమీకరణపై రైతులు రెండో రోజు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తీసుకున్న భూములకు తగిన పరిహారం చెల్లించాలన్నారు. రైతుల నిరసనకు తెదేపా మద్దతు పలికింది.

farmers concern
farmers concern

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో జగనన్న కాలనీ లే-అవుట్ కోసం చేపట్టిన భూసమీకరణకు వ్యతిరేకంగా రెండో రోజు రైతులు నిరసన కొనసాగించారు. పెందుర్తి తహసీల్దారు బాబీ ఆధ్వర్యంలో వీఎం ఆర్డీఏ అధికారులు భూములను చదును చేసే పనులు ప్రారంభించారు. రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో పోలీసులను రంగంలోకి దించారు.

తమకు న్యాయం చేయాలని రైతులు నినాదాలు చేశారు. తీసుకున్న భూములకు పరిహారంగా ఎకరాకు పట్టా ఉంటే 900 గజాలు, పట్టా లేకుంటే 400 గజాల చొప్పున స్థలం చూపించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని తహసీల్దారు హామీ ఇచ్చారు. పనులను అడ్డుకోవద్దని కోరారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రైతులు కోరగా.. తహసీల్దారు నిరాకరించారు.

తెదేపా మద్దతు : విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అక్కడికి చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. తెదేపా హయాంలో ఇక్కడి రైతులకు డీపట్టా భూములు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ భూములు తీసేసుకుంటే ఎలా బతుకుతారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:అధ్యాపకుల్లేని చదువులు.. ఆందోళనలో విద్యార్థినులు

ABOUT THE AUTHOR

...view details