ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కిరాతకం: 20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు

By

Published : Apr 16, 2021, 5:59 AM IST

ఒక్కడినే చంపేస్తే క్షణంలో తేలిపోతుంది. కుటుంబాన్నే సమూలంగా తుడిచిపెడితే జీవితాంతం కుంగి, కృశించేలా చేయొచ్చు. విశాఖ జిల్లా జుత్తాడలో 20 నిమిషాల్లో ఆరుగురు కుటుంబసభ్యులను తెగనరికిన అప్పలరాజు అమానుష ఆలోచన ఇది. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పగ పెంచుకున్న కిరాతకుడు... అదును చూసి అనుకున్నంతా చేశాడు. ప్రాణభయంతో, దూరప్రాంతంలో తల దాచుకుంటున్న కుటుంబం... శుభలేఖలు పంచేందుకు ఊరికొచ్చి హత్యాకాండకు బలైంది. పసిపిల్లలనూ నిలువునా నరికేసిన హృదయవిదారక దృశ్యాలు... అందరితో కంటతడి పెట్టించాయి.

20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు
20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు

20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు

ప్రతీకారేచ్ఛతో మానవమృగం సృష్టించిన హత్యాకాండ... విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడ గ్రామాన్ని వణికించింది. ఈ దురాగత ఘటనతో నిశ్చేష్టులైన బాధిత కుటుంబసభ్యులు... నిందితుడి వదిలేది లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని తమకు అప్పగిస్తేనే మృతదేహాలను తరలిస్తామంటూ ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న మహిళా సంఘాలవారు... ఆడవాళ్లు, చిన్న పిల్లలని నరికి చంపడంపై ఆవేదన వ్యక్తంచేశారు. నిందితుడు అప్పలరాజును కఠినంగా శిక్షించడం సహా... అక్రమ ఆస్తులపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అక్కడికి చేరుకొని... బాధిత కుటుంబానికి నచ్చజెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చివరకు పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను కేజీహెచ్​కు తరలించారు. గ్రామంలో భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ మనీశ్​కుమార్ సిన్హా ఘటనాస్థలాన్ని పరిశీలించగా... ఏసీపీ శ్రీపాదరావు నేతృత్వంలో కేసు దర్యాప్తు సాగుతోంది.

జుత్తాడకు చెందిన బమ్మిడి విజయ్‌కిరణ్‌... భార్య, ముగ్గురు పిల్లలతో విజయవాడలో జీవిస్తున్నాడు. నిందితుడు అప్పలరాజు కుమార్తెపై అత్యాచారం చేశాడని.. 2018లో విజయ్‌పై కేసు నమోదైంది. అప్పటినుంచీ ఇరు కుటుంబాల మధ్య కేసులు, ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలోనే విజయవాడలోని అత్తారింటికి మకాం మార్చాడు. మేనత్త కుటుంబం కూడా విజయ్‌తోనే కలిపి ఉండేది. ఉమ్మడిగా నివసించే వారంతా... ఇటీవల స్థానిక ఎన్నికల్లో ఓటేసేందుకు జుత్తాడ వచ్చారు. విహహ కార్యక్రమం ఉన్నందున, గురువారం షాపింగ్‌ చేసి శుక్రవారానికి విజయవాడ వెళ్లాలని భావించారు.

అదును కోసం చూస్తున్న అప్పలరాజు... గురువారం తెల్లవారుజామున మారణకాండకు తెగబడ్డాడు. ఘటన జరిగిన సమయంలో విజయ్‌ పెద్ద కుమారుడు అఖిల్‌... బంధువుల ఇంట్లో నిద్రపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. 20 నిమిషాల్లో ఆరుగురిని నరికి చంపిన నిందితుడు బత్తిన అప్పలరాజుకు... గతంలోనూ నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2012 నాటి స్థల వివాదంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేయగా, ఆ కేసులో ఏ-2గా ఉన్నట్లు తేలింది. హత్యాకాండకు దారితీసిన పరిస్థితులను... తీవ్ర ఆవేదనతో బాధితుడు విజయ్‌ వివరించాడు.

తన కుమార్తె జీవితం నాశనం చేసిన విజయ్‌ ఒక్కడినే చంపేస్తే క్షణంలో తేలిపోతుందని... కుటుంబాన్నే హతమారిస్తే జీవితాంతం కుమిలి, కృశించి పోతాడనే ఆలోచనతోనే ఘాతుకానికి తెగబడ్డానని నిందితుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఆరుగురిని హతమార్చిన తర్వాత పశ్చాత్తాపం లేకపోగా.. చిన్న పిల్లలను చంపేశానన్న బాధ కూడా కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. జుత్తాడలో పొలాలు, పశుసంపద ఉన్న అప్పలరాజు... నర్సరీ కూడా నడుపుతున్నాడు. సోదరులు, బంధువుల కుటుంబాలతో భారీ బలగం ఉంది. కానీ విజయ్ కుటుంబంపై పెంచుకున్న ద్వేషం... మృగంలా మార్చిందని భావిస్తున్నారు.

ఇదీ చదవండీ... తల్లి, తండ్రి, తమ్ముడి హత్య.. పొగ తీవ్రతకు నిందితుడి మరణం

ABOUT THE AUTHOR

...view details