ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. : నారాయణ

By

Published : Apr 6, 2023, 6:31 PM IST

CPI National Secretary Narayana Fire on CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‍ చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వైసీపీని ఓడించాలన్న పవన్‍ కల్యాణ్‍ నిర్ణయం మంచిదేనన్నారు.

Narayana
Narayana

CPI National Secretary Narayana Fire on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‍ చేశారు. తిరుపతి నగర శివార్లలోని శెట్టిపల్లి భూములను సందర్శించిన ఆయన.. శెట్టిపల్లి భూముల వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్‍ చేశారు. సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో శెట్టిపల్లి భూములలో ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసిన బాధితుల, రైతులకు సంబంధించిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పంచాలి: ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా మాట్లాడుతూ..''తిరుపతి నగర శివార్లలో ఉన్న శెట్టిపల్లి భూములను ఆనాడు ప్రజలు తక్కువ ధరకు రావడంతో సెంటు, రెండు సెంట్లు, మూడు సెంట్లు అలా కొనుక్కున్నారు. ఆ తర్వాత ఇళ్లను కట్టుకోవాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వచ్చి ల్యాండ్ పోలింగ్ పెడతామని, 500 ఎకరాలను తీసుకుంటామని, మీకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి.. ఈ స్థలంలో మీటింగ్ పెట్టి.. చంద్రబాబు చెప్పిందంతా అబద్ధం తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ భూములను మీకే ఇచ్చేస్తామంటూ హామీలు ఇచ్చారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవువుతుంది. ఇప్పటిదాకా ఈ భూములవైపే తిరిగి చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకుని.. ఈ స్థలంలో ప్రజలు ఇళ్లు కట్టుకున్న తర్వాత రోడ్లు, నీళ్లు, విద్యుత్ సదుపాయాలను కల్పించాలి. వాటికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు చూయించి అందులో సగం ప్రభుత్వం, మరికొంత సగం భూమిని కొన్న వారి వద్ద వసూలు చేసి, వారికి కనీస మౌలిక సదుపాయాలను కల్పించండి.'' అని ఆయన అన్నారు.

శెట్టిపల్లి భూముల వివాదాన్ని పరిష్కరించాలి: అనంతరం గ్రామీణ, నగర వైసీపీ నాయకుల మధ్య వాటాలు పంచుకోవడంలో తేడాలు రావడంతో శెట్టిపల్లి భూముల అంశాన్ని మరింత వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయంలో ల్యాండ్‍ పూలింగ్‍ విధానంలో చేపట్టిన భూసేకరణను తప్పు బట్టిన జగన్‍.. నాలుగేళ్ళు గడుస్తున్నా ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. శెట్టిపల్లి భూములను తిరుపతి నగరపాలక సంస్ధలోకి విలీనం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనుమానస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ నిర్ణయం సరైనదే: రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేయాలన్న ఆలోచన మంచిది కాదన్న నారాయణ.. వైసీపీని ఓడించాలన్న పవన్‍ కల్యాణ్‍ నిర్ణయం మంచిదేనన్నారు. బీజేపీతో జనసేన జత కట్టాల్సిన అవసరమేంటని.. జనసేన, బీజేపీ, టీడీపీలు కలిసి పోటీ చేస్తే జగన్‍‌కు లబ్ధి చేకూరుతుందన్నారు.

మార్గదర్శిపై సీఎం జగన్‌ది కక్ష సాధింపు:మార్గదర్శి విషయంలో జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శిలో ఎదైనా తప్పు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని.. కక్ష సాధింపుతో కాదని హితవు పలికారు. గతంలో ఇదే తరహాలో వైఎస్‍ రాజశేఖర్‍ రెడ్డి వేధింపులకు గురి చేశారని.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‍ పార్టీ అధికారంలో ఉన్న కూడా ఏమి చేయలేకపోయారని గుర్తు చేశారు. తప్పులు ఉంటే ఆనాడే ఎందుకు చర్యలు తీసుకోలేదని? ఆయన ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల తర్వాత జగన్‍‌కు ఇప్పుడు మార్గదర్శి గుర్తుకొచ్చిందా..? అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details