ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బెజవాడ మేయర్‌ పీఠంపై శ్రీకాకుళం 'భాగ్య'0..!

By

Published : Mar 18, 2021, 10:54 AM IST

సిక్కోలు ఆడపడుచు విజయవాడ మహానగరానికి ప్రథమ పౌరురాలు కాబోతున్నారు. రాయన భాగ్యలక్ష్మీని అనూహ్యంగా మేయర్‌ పదవి వరించింది. ఈమె భర్త నరేంద్రకుమార్‌ది విజయవాడ.

బెజవాడ మేయర్‌ పీఠంపై శ్రీకాకుళం 'భాగ్యం'
బెజవాడ మేయర్‌ పీఠంపై శ్రీకాకుళం 'భాగ్యం'

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి రాయన భాగ్యలక్ష్మీ కోడలుగా వెళ్లారు. తాజా ఎన్నికల్లో కార్పొరేటర్‌గా వైకాపా తరఫున విజయం సాధించారు. ఈమె అభ్యర్థిత్వాన్ని బుధవారం రాత్రి వైకాపా అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం పోడలి గ్రామానికి చెందిన బెవర నారాయణరావు, యశోద కృష్ణవేణిలకు అయిదుగురు సంతానం. నారాయణరావు జలవనరుల శాఖలో వర్క్‌ఇన్‌స్పెక్టరుగా పనిచేశారు. వీరికి రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, ఉమాదేవి ముగ్గురు కుమార్తెలుకాగా, దుర్గాప్రసాద్‌, దిలీప్‌చక్రవర్తి ఇద్దరు కుమారులు. దుర్గాప్రసాద్‌ జలవనరులశాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌ కాగా, దిలీప్‌చక్రవర్తి ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. రెండో కుమార్తె రాయన భాగ్యలక్ష్మి ఇంటర్‌ వరకు చదువుకున్నారు. 2002లో విజయవాడకు చెందిన కేబుల్‌ నెట్‌ వర్క్‌ వ్యాపారి రాయన నరేంద్రకుమార్‌తో వివాహమైంది. ఈయన సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ భాగ్యలక్ష్మి సోదరి రాజ్యలక్ష్మిని వివాహమాడారు. సొంత అక్కచెల్లెళ్లు, సొంత అన్నదమ్ములనే మనువాడారు. మరోసోదరి ఉమాదేవి మెట్టినిల్లు కూడా విజయవాడే. ఈమె కనకదుర్గ అమ్మవారి ఆలయ ఛైర్మన్‌ స్వామినాయుడుకు స్వయానా కోడలు.

అక్కడే పెరిగాను

విజయవాడ నగర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది. 46వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించాను. మా కన్నవారిది సంతకవిటి మండలం పోడలి. పుట్టి పెరిగిందంతా అక్కడే. నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. సీఎం జగన్‌, మంత్రుల నమ్మకాన్ని నిలబెడతాను.

-రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్‌ అభ్యర్థి

ఇదీ చదవండి:నగర, పురపాలికల్లో కొలువుదీరనున్న నూతన పాలకవర్గాలు

ABOUT THE AUTHOR

...view details