ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURDER: భార్యను పుట్టింటి నుంచి తీసుకురాలేదని.. అతను ఏం చేశాడంటే..!

By

Published : Jun 8, 2022, 3:10 PM IST

Updated : Jun 9, 2022, 6:47 AM IST

MURDER: భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన భార్య పుట్టింటికి వెళ్లింది. తన భార్యను తీసుకురావాలని తల్లిదండ్రుల మీద కుమారుడు ఒత్తిడి తీసుకొచ్చాడు. కొడుకు మనస్తత్వం తెలిసిన తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. దాంతో ఆగ్రహం చెందిన అతను కన్నవారని చూడకుండా కడతేర్చాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో చోటు చేసుకుంది.

murder
murder

MURDER:తన భార్యను కాపురానికి తీసుకురాలేదని సొంత తల్లిదండ్రులపైనే మద్యం మత్తులో దాడిచేసి, తల్లి మృతికి కారణమైన ఓ తనయుడి ఉదంతమిది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కె.గోపాలపురంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... కె.గోపాలపురం వాసులు బోసి భాగవతమ్మ(65), రామారావు(76) దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ వివాహాలయ్యాయి. పెద్ద కుమారుడు శ్రీనివాసరావు, తన భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి పాతపట్నంలో నివాసం ఉంటున్నాడు. ఈయన సీఆర్‌పీఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి, ఉద్యోగ విరమణ పొందాడు. ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల భార్యపై అనుమానంతో వేధింపులకు గురిచేయగా, భరించలేక ఆమె ఒడిశాలోని పర్లాఖెముండిలోని తల్లిగారింటికి వెళ్లిపోయింది. వెనక్కి తీసుకురావడానికి గ్రామ పెద్దల ద్వారా ప్రయత్నం చేయగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో కె.గోపాలపురంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తన భార్యను తీసుకురావాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులోనే తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన శ్రీనివాసరావు వారితో వాగ్వాదానికి దిగాడు. అర్ధరాత్రి 2గంటల సమయంలో వారిపై కత్తి, కర్రలతో దాడి చేశాడు. తల వెనుక భాగంలో ఇద్దర్నీ తీవ్రంగా గాయపరిచాడు. తల్లి అక్కడికక్కడే ప్రాణం వదలగా, తండ్రికి తీవ్ర రక్తస్రావమై నిస్సహాయంగా ఉండిపోయారు. అనంతరం గ్రామంలోని పలువురికి ఫోన్‌ చేసిన శ్రీనివాసరావు... తన తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టానని తెలిపాడు. స్థానికులు వచ్చి చూసి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి రామారావు ప్రస్తుతం శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Last Updated : Jun 9, 2022, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details