ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రి గారి.. పాత్రికేయ పాఠాలు.. మీరూ వింటారా!!

By

Published : Oct 31, 2022, 1:38 PM IST

Updated : Oct 31, 2022, 2:44 PM IST

Minister Sidiri Fires On Eenadu Reporter: జనం తరఫున గొంతుకై నిలుస్తూ వారి ఆవేదనను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న ‘ఈనాడు’ దినపత్రికపై మంత్రి అప్పలరాజు తన అక్కసంతా వెళ్లగక్కారు. భావనపాడు పోర్టు నిర్వాసితుల ఘోషను పత్రికలో ప్రచురించటమే మహానేరం అన్నట్లుగా.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల ‘న్యూస్‌టుడే’ విలేకరి రవికుమార్‌ను నిండు సభలో అవమానించారు.

Minister Sidiri Fires On Eenadu Reporter
Minister Sidiri Fires On Eenadu Reporter

Minister Fires On Eenadu Reporter : రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు.. విలేకరులకు జర్నలిజం పాఠాలు బోధిస్తున్నారు. వార్త ఎలా రాయాలో.. ఎలా రాయకూడదో.. ఏం రాయాలో కూడా ఆయనే చెబుతారట! ఆ మంత్రివర్యుల వద్ద విలేకరులు అది నేర్చుకోవాలట. ఇంకా నయం అంతటితో ఆగారు.. ‘వార్త కూడా నేనే రాసిస్తా.. దాన్నే అచ్చేయండి’ అనకపోవటం సంతోషం. జనం తరఫున గొంతుకై నిలుస్తూ వారి ఆవేదనను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న ‘ఈనాడు’ దినపత్రికపై మంత్రి అప్పలరాజు తన అక్కసంతా వెళ్లగక్కారు.

భావనపాడు పోర్టు నిర్వాసితుల ఘోషను పత్రికలో ప్రచురించటమే మహానేరం అన్నట్లుగా.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల ‘న్యూస్‌టుడే’ విలేకరి రవికుమార్‌ను నిండు సభలో అవమానించారు. ఆయన్ను సభలో అందరి ముందు నిలబెట్టి హేళనగా మాట్లాడారు. ఏకవచనంతో సంబోధిస్తూ కించపరిచారు. ఆ సమయంలో ఆయన పక్కనే కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, టెక్కలి సబ్‌కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. విలేకరి తన వాదన వినిపించేందుకు ప్రయత్నించినా, ‘కూర్చో.. నువ్వు మాట్లాడుదువులే’ అంటూ మంత్రి హేళనగా మాట్లాడారు.

మంత్రి గారి.. పాత్రికేయ పాఠాలు.. మీరూ వింటారా!!

వార్త రాసినందుకు బెదిరిస్తూ.. హెచ్చరిస్తూ

భావనపాడు పోర్టు భూసేకరణ కోసం సంతబొమ్మాళి మండలం మూలపేటలో పోర్టు నిర్వాసితులతో ఆదివారం మంత్రి అప్పలరాజు, జిల్లా అధికారులు సమావేశం నిర్వహించారు. తొలుత అప్పలరాజు ప్రసంగిస్తూ.. ‘ఇక్కడ ఈనాడు పత్రిక వారెవరున్నారు?’ అని ప్రశ్నించారు. సంతబొమ్మాళి మండల విలేకరి రవికుమార్‌ తానేనని చెప్పగా ‘ఇటు రా .. ముందుకు రా’ అని ఏకవచనంతో సంబోధిస్తూ గ్రామసభలో అందరిముందు వేదికకు ఎదురుగా నిలబెట్టారు. ‘టెక్కలి సబ్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో ఇటీవల పోర్టు నిర్వాసితులతో మేము చర్చించాం. ఆ సమావేశంలో వారు అడగాల్సింది వారు అడిగారు. ప్రభుత్వం చేయగలిగిందేంటో మేం చెప్పాం’ అన్నారు.

‘నీది ఈ ఊరేనా? టెక్కలి నియోజకవర్గమేనా? నౌపడ యేనా? అబద్ధాలు రాస్తే ఊరుకోం’ అంటూ విలేకరిని తీవ్ర స్వరంతో బెదిరించారు. ‘గత ప్రభుత్వ హయాంలో వంశధార ప్రాజెక్టు భూసేకరణ సమయంలో కర్ఫ్యూ విధించి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించినప్పుడు, రణస్థలంలో కొవ్వాడ అణువిద్యుత్తు కేంద్రం, ఆఫ్‌షోర్‌ కోసం భూసేకరణ జరిగినప్పుడు ఇలాగే వార్తలు రాశారా..?’ అని ప్రశ్నించారు. ‘పోర్టు వద్దని ఒకటే గొంతు.. అంటూ వార్తలు రాస్తారా? అలా అయితే అది ఏ దుబాయ్‌కో, ఖతార్‌కో వెళ్లిపోతుంది. అప్పుడు నువ్వు అక్కడే వెళ్లి వార్తలు రాయి’ అంటూ హేళనగా, కించపరుస్తూ మాట్లాడారు.

అప్పలరాజుకు ఈనాడుపై ఎందుకు అంత అక్కసంటే!

భావనపాడు పోర్టు నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రం ప్రజలతో ఈ నెల 17న టెక్కలి సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. ఆయా గ్రామాల ప్రజలు వ్యక్తం చేసిన అనుమానాలు, సందేహాలు, లేవనెత్తిన ప్రశ్నలపై వారు ముగ్గురూ అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే సమాధానాలిచ్చారు. ‘మీరు గొంతెమ్మ కోర్కెలు కోరితే కుదరదు’ అంటూ నిర్వాసితులను హెచ్చరించారు. దీనిపై ఈ నెల 18న ఈనాడు శ్రీకాకుళం జిల్లా ఎడిషన్‌లో ‘మీకిచ్చేదే ఎక్కువ.. ఎవరికీ రానంత పరిహారం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.

నిర్వాసితులైన రైతులు మాట్లాడేందుకు యత్నించిన ప్రతిసారీ వారికి అవకాశమివ్వకుండా వారు లేవనెత్తినవి చిన్న సమస్యలుగా మంత్రి, అధికారులు కొట్టిపడేశారు. ఓ నిర్వాసితుడు సమస్య వివరించేందుకు ప్రయత్నించగా.. ‘నువ్వు కూడా మాట్లాడేస్తున్నావా?’ అంటూ మంత్రి అప్పలరాజు అతనిపై గర్జించారు. మోహన్‌రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతుండగా ‘నోరు అదుపులో పెట్టుకో.. చెప్పిందే చెప్తున్నావు’ అంటూ అప్పలరాజు హెచ్చరించారు. శివ అనే రైతు తన ఆవేదన చెప్పటానికి లేవగా ‘పదేపదే ఎందుకు మాట్లాడుతున్నావ్‌.. మధ్యాహ్నం భోజనం చేయలేదా? ఆయనకు ఖర్జూరం పెట్టండి’ అంటూ మంత్రి అతనిపై విరుచుకుపడ్డారు.

ఇదే సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘మీ డిమాండ్లలో కొన్ని దేశంలో ఎక్కడా అమలు చేయలేదు. మీరు చేసింది త్యాగంలా కనిపించాలి తప్ప, ఉన్నంత మేరకు లాక్కుందామనే ధోరణిలో ఉండకూడదు. నిద్రపోతుంటే లేపగలం కానీ.. నటిస్తే ఏం చేయలేం. ఆరు నెలలుగా సమావేశాలు పెడుతున్నాం. మాకేం తెలియదు అనటం ఏంటి?’ అని నిర్వాసితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూలపేట గ్రామం ఏం బాగోదు. ఎక్కడ చూసినా మురికి. మేం అందమైన ఆధునిక హంగులతో కాలనీ నిర్మించి ఇస్తాం’ అని వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. ఈ విషయాలన్నీ వార్త రూపంలో ప్రచురించినందుకు అప్పలరాజు ఇప్పుడు ‘ఈనాడు’పై అక్కసు వెళ్లగక్కారు.

మంత్రి సీదిరి అప్పలరాజుకు చేదు అనుభవం:మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘భావనపాడు పోర్టు నిర్మాణానికి భూములివ్వండి.. చెక్కులిస్తాం.. సన్మానిస్తాం’ అని చెప్పినా... పోర్టు నిర్వాసిత గ్రామాల ప్రజల నుంచి వారికి చుక్కెదురైంది. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం సరిపోదని.. కనీసం మరో రూ.5 లక్షలు పెంచి ఇవ్వాలని వారంతా స్పష్టంచేశారు. గతంకంటే ఇది చాలా ఎక్కువని, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమని ప్రజాప్రతినిధులు, అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

45 నిమిషాల పాటు వారంతా వేదికపై ఎదురుచూసినా, ఏ ఒక్క రైతూ వెళ్లి చెక్కు తీసుకోలేదు. దీంతో మంత్రి, ఎమ్మెల్సీ, కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ అంతా వెనుదిరగాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించనున్న భావనపాడు గ్రీన్‌పీల్డ్‌ పోర్టు భూసేకరణలో భాగంగా నిర్వాసిత గ్రామాలైన సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఆదివారం గ్రామసభ నిర్వహించారు. జిరాయితీ భూమికి ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తామన్నా రైతులెవరూ ముందుకెళ్లలేదు.

డిసెంబరు మొదటివారంలో సీఎం జగన్‌ చేతులమీదుగా పోర్టుకు భూమిపూజ చేస్తామని, జిల్లా అభివృద్ధికి ఈప్రాంత రైతులు సహకరించాలని నాయకులు కోరారు. రైతులను వేదికపైకి ఆహ్వానించారు. అయితే, రూ.20 లక్షల పరిహారం ఏ మాత్రం సరిపోదని... రూ.5 లక్షలు పెంచాలని సర్పంచి జీరు బాబురావు, గ్రామస్థులు, రైతులు పట్టుబట్టారు. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని, ప్రజల తరఫున నిలబడతామని మంత్రి, ఎమ్మెల్సీ చెప్పినా గ్రామస్థులు అంగీకరించలేదు.

పోరంబోకు భూములకు సగం ధర ఇస్తామని గతంలో చెప్పారని, ఇప్పుడు మాట మారుస్తున్నారెందుకని కొందరు రైతులు ప్రశ్నించారు. ఉప్పు భూములు, సీఆర్‌జడ్‌ భూములకు పరిహారం ఇవ్వలేమని, ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల్లో రైతులు వేసుకున్న కొబ్బరి, జీడిచెట్లకు నష్టపరిహారం ఇవ్వడానికి చూస్తామని కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి.లఠ్కర్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2022, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details