ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాకరపల్లి ఘటనకు నేటితో 13 ఏళ్లు.. అయినా నేరవేరని హామీలు.. మారని తలరాతలు..!

By

Published : Feb 28, 2023, 7:34 AM IST

BHAVANAPADU THERMAL POWER PROJECT: నేనున్నానంటూ భరోసా కల్పించారు.. దీక్షా శిబిరంలో కూర్చుని మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే జీవో రద్దు చేయడమే కాదు.. మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చారు. థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా పోరాడిన వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తామని చెప్పారు. జగన్ అధికారం చేపట్టి నాలుగేళ్లు కావొస్తున్నా.. శ్రీకాకుళం జిల్లా కాకరపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీకి ఇచ్చిన హామీ.. నేటికీ నెరవేరలేదు. జగన్ మాట ఇచ్చి మడమ తిప్పారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PROTEST AGAINST BHAVANAPADU THERMAL POWER PROJECT
PROTEST AGAINST BHAVANAPADU THERMAL POWER PROJECT

కాకరపల్లి ఘటనకు నేటితో 13 ఏళ్లు.. అయినా నేరవేరని హామీలు.. మారని తలరాతలు..!

PROTEST AGAINST BHAVANAPADU THERMAL POWER PROJECT : పచ్చని పల్లెపై నెత్తురు చిందిన విషాద ఘటన ఇంకా అక్కడి ప్రజల కళ్ల ముందు మెదులుతూనే ఉంది. మా పొట్ట కొట్టొద్దు మమ్మల్ని ఇలా బతకనీయండి అని గొంతెత్తిన వారిపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించిన అమానవీయ సంఘటనకు నేటితో 13 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాకరపల్లి భూముల్లో 2008లో భావనపాడు ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

దాదాపు 12 వేల కోట్ల ఖర్చుతో 2,640 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు నిర్మాణానికి తొలుత 3,333 ఎకరాల భూమిని ఓ సంస్థకు కేటాయించారు. జాతీయ అక్యులేట్ అథారిటీ షరతుల ప్రకారం చివరిగా వడ్డీ తాండ్ర, ఆకాశ లఖవరం,కాకరపల్లి తంపర భూముల ప్రాంతాల్లో 2,300 ఎకరాల్లో ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. భూసేకరణ చేపడుతున్న సమయంలో ఆకాశ లఖవరం, వడ్డీ తాండ్ర, హనుమంతు నాయుడుపేట తదితర గ్రామాల రైతులు, యువత, మహిళలు పంట భూములు పోతాయని.. పర్యావరణం దెబ్బతింటుందని.. ఉపాధి కోల్పోతామని ఆందోళనలు చేశారు.

"2011 ఫిబ్రవరి 25, 28న ఇక్కడ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత జగన్​ మోహన్​రెడ్డి ఇక్కడికి వచ్చారు. అధికారంలోకి రాగానే జీవో రద్దు చేస్తామని జగన్​ మాటిచ్చారు. ఇప్పటికైనా మాకు ఇచ్చిన హామీని నేరవేర్చి మాకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం"-అనంత హన్నూరావు, వడ్డీతాండ్ర స్థానికుడు

2009 ఆగస్టు 15న కాకరపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో 2011 ఫిబ్రవరి 24న పోలీసులు ప్రజల మధ్య ఘర్షణలో వడ్డీ తాండ్ర గ్రామం అగ్నికి ఆహుతయింది. దాదాపు 50 ఇల్లు మంటలో కాలిపోయాయి. అనంతరం ఫిబ్రవరి 28న పోతినాయుడుపేట కూడల్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

నాటి నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రం వ్యతిరేక పోరాట కమిటీ నిరసన దీక్ష చేపట్టగా పాదయాత్రలో భాగంగా 2018 డిసెంబర్ 21న అక్కడి దీక్షా శిబిరాన్ని జగన్ సందర్శించారు. తాను అధికారంలోకి రాగానే వివాదస్పద జీవో రద్దు చేసి ఈ భూములన్నీ మత్స్యకారులకే ఇస్తానని హామీ ఇచ్చినట్లు పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లవుతున్నా ఇప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు.

"పాదయాత్ర సమయంలో జగన్​ వచ్చి మాకు మాటిచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేస్తామన్నారు. మా పై ఉన్న కేసులను కూడా రద్దు చేస్తామన్నారు. ఇప్పటికి కూడా కేసుల కోసం పోలీస్​స్టేషన్ల చుట్టూ తిరగడమే కానీ అవి మాత్రం రద్దు కాలేదు"-మండల గన్ను, విద్యుత్​ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు

తంపెర భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ రొయ్యల చెరువులను తొలగించి.. ఆ భూములన్నీ మత్స్యకార సంఘానికే ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. కేసులు మాఫీ చేస్తామని చెప్పినా.. ఇప్పటికీ పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details