Plastic Flexis ban: రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు గడువు సమీపిస్తోంది. నవంబరు 1వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి వస్తుండటంతో ఫ్లెక్సీ వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకాశం జిల్లాలో దాదాపు... వంద ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయి. వేలాది కుటుంబాలు ఈ వ్యాపారం మీదే జీవిస్తున్నాయి. గ్రాఫిక్స్ డిజైనర్లు, ప్రింటింగ్ కార్మికులు, ఫ్లెక్సీల ఫ్రేమ్స్ తయారీదారులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే కూలీలు ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నిషేధం విధించడం వల్ల ఏం చేయాలో తమకు అర్థం కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తరువాతే నిషేధం అమలు చేయాలని కోరుతున్నారు.
ప్లాస్టిక్ ఫ్లెక్సీ ముద్రణా యంత్రాలను లక్షల రూపాయలు రుణాలు తీసుకుని కొన్నామని, బ్యాంకు అప్పులు తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నామని వ్యాపారులు వాపోతున్నారు. కరోనా రెండేళ్లూ వ్యాపారాలు లేక ఆర్ధికంగా ఇబ్బంది పడ్డామని, ప్రభుత్వ నిర్ణయంతో అప్పులనుంచి బయటపడే మార్గమే కనిపించడంలేదని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా క్లాత్ ఫ్లెక్సీలు తయారు చేసే యంత్రాలు తేవాలంటే...ఇప్పటికిప్పుడు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.