Winter has started in Telangana: ఈ ఏడాది తెలంగాణలో ముందుగానే చలి మొదలైంది. ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు తగ్గడంతో శీతల వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నవంబరు రెండో వారం చివరి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పుడు మూడు వారాల ముందే ఆ పరిస్థితి మొదలైంది. ముఖ్యంగా గత 4 రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘రష్యా, కజకిస్థాన్ సమీపంలోని కాస్పియన్ సముద్రం మీదుగా గాలుల ద్రోణి అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఉత్తర భారతం మీదుగా తెలంగాణ వరకూ విస్తరించింది. దీనివల్ల పశ్చిమ గాలుల్లో అస్థిరత ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను బంగ్లాదేశ్ తీరం వైపు వెళ్తూ గాలిలోని తేమనంతా పీల్చేయడంతో పొడివాతావరణం ఏర్పడి వర్షాలు తగ్గిపోయాయి’’ అని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో గాలిలో తేమ సాధారణంగా 73 శాతం ఉండాలని, ప్రస్తుతం 54కి పడిపోవడం ఈ ప్రభావమేనని ఆమె ఉదహరించారు. నల్గొండలోనూ సాధారణంకన్నా 21 శాతం తగ్గిందని పేర్కొన్నారు.
4,5 డిగ్రీలు తక్కువగా... ఈ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామంలో 11.6, హైదరాబాద్ నగరంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.6 డిగ్రీలు తక్కువ. మెదక్‌లో 5.4 డిగ్రీలు తక్కువగా ఉంది.
తగ్గిన విద్యుత్తు వినియోగం.. చలి వాతావరణంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్తు వినియోగం పడిపోయింది. బుధవారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6,875 మెగావాట్లకు పడిపోయింది. కొద్దిరోజుల క్రితం 13 వేల మెగావాట్లుండటం గమనార్హం. సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీలు తగ్గినప్పుడు వాతావరణంలో అసాధారణ మార్పులు వస్తుంటాయి. గత ఐదురోజులుగా పశ్చిమ భారతం నుంచి వస్తున్న గాలుల్లో అస్థిరత కూడా శీతల వాతావరణానికి మరో కారణం. బుధవారం నుంచి తూర్పు, ఈశాన్య ప్రాంతాల మీదుగా గాలులు రావడం ప్రారంభమైనందున రాబోయే వారం రోజులు చలి పెరిగే అవకాశాలు లేవు. నవంబరు రెండో వారం నుంచి మాత్రం తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు.
29 నుంచి ఈశాన్య రుతు పవనాలు.. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి వెనక్కి వెళ్లిపోయినందున.. ఈశాన్య రుతుపవనాలు రావడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. వీటివల్ల ఈ నెల 29 నుంచి దక్షిణ భారతదేశంలో వర్షాలు ప్రారంభం కానున్నాయని, వీటి ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని, వాతావరణంలో అసాధారణ మార్పులు వస్తే తప్ప ఇప్పట్లో తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలు లేవని పేర్కొంది.
ప్రాణాంతక వ్యాధులతో ముప్పు.. చలి వాతావరణంలో వైరస్‌లు విజృంభిస్తాయి. శరీరంలోని అనేక అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా చలి తీవ్రత పెరిగినప్పుడు శ్వాసనాళాలు కుచించుకుపోతాయి. గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. వైరస్‌ల కారణంగా జలుబు, గొంతునొప్పి, సైనసైటీస్, నిమోనియా, ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీఓపీడీ) తదితర శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయి. ఫ్లూ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఆస్తమా, సీఓపీడీ రోగాలతో బాధపడే వారి మరణాలు చలికాలంలోనే ఎక్కువ. కాబట్టి అలాంటి వారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకునే ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, జన సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్‌లు ఒకరి ద్వారా మరొకరికి తేలిగ్గా వ్యాపిస్తాయి. అలాంటి ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. వెళ్లే పక్షంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
చర్మం..జరభద్రం.. చలి కాలంలో వాతావరణంలో తేమ తగ్గుతుంది. ఫలితంగా శరీరం నుంచి నీరు ఆవిరవుతుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో చర్మం పూర్తిగా పొడిబారుతుంది. కాళ్లలో పగుళ్లు ఏర్పడి దురదలొస్తాయి. మధుమేహుల్లో అవి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. అలాంటి వారు వైద్యుడి సలహా మేరకు మందులను మార్చుకోవాలి. పొడిబారే సమస్యను నివారించడానికి చర్మంపై తేమను పెంచే లేపనాలు ఉపయోగించాలి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె వంటివి చర్మానికి రాయాలి. ఈ కాలంలో చుండ్రు వేధిస్తుంది. దాన్ని తగ్గించే షాంపులనూ వైద్యుల సలహాతో వాడాలి. గ్లిజరిన్ ఉండే సబ్బులు వినియోగించడం మేలు. దురద, సొరియాసిస్‌తో బాధపడుతున్న వారికి చలికాలంలో సమస్యలు ఎక్కువవుతాయి. వైద్యుల సలహా మేరకు ఔషధాలను మార్చుకోవడం మంచిది.
ఇవీ చదవండి: