ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆటంకాలను అధిగమించి.. అగ్రరాజ్యంలో సైంటిస్టు స్థాయికి..

By

Published : Apr 10, 2022, 7:48 PM IST

సమస్యలు ఎదురైతే కొందరు కుంగిపోతారు. ఇంకొందరు మాత్రం వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు. ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్‌. పేదరికం, దివ్యాంగులైన తల్లిదండ్రులు తదితర ఆటంకాలను అధిరోహించి అమెరికాలో సైంటిస్టుగా ఎదిగారు. పట్టుదల, సంకల్పం ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు.

Scientist Ashok
Scientist Ashok

నెల్లూరు జిల్లా ఏఎస్​పేటకు చెందిన చీమల తిరుపాలు, నాగమ్మ దంపతులకు అశోక్‌, ఆనంద్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. తల్లిదండ్రులిద్దరూ దివ్యాంగులైనా... తినడానికి తిండి లేకున్నా పిల్లలను ఎప్పుడూ చదువుకు దూరం చేయలేదు. ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివినా... ఆపై చదువుల కోసం ఆత్మకూరు వెళ్లాల్సి వచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో అశోక్‌ కూలీ పనులకు వెళ్తూనే పదో తరగతి పూర్తి చేశారు. తనతో పాటు తమ్ముడిని కూడా చదివించారు. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు.

ఆటంకాలను అధిరోహించి... అగ్రరాజ్యంలో సైంటిస్టు స్థాయికి...

ప్రతిభకు ఫిలోషిప్: వింజమూరులో ఇంటర్‌, ఆత్మకూరులో డిగ్రీ చదివి ప్రథమ స్థానంలో నిలిచారు. 2010లో బెంగళూరు యూనివర్శిటీలో జెనిటిక్స్ విభాగంలో పీజీ చదివి గోల్డ్ మెడల్ సాధించారు. 2019లో బయాలజిలో కేన్సర్‌పై పీహెచ్​డీ చేశారు. అశోక్‌ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం... నెలకు 40వేల రూపాయలు ఫెలోషిప్ అందించింది. భోపాల్‌ ఐఐఎస్ఈఆర్​.లో కేన్సర్ బయాలజీపై డాక్టరేట్ చేశారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్‌ను 70వేల రూపాయలకు పెంచింది.

అనేక దేశాల ఆహ్వానం:2020లో ఏడాదికి 40లక్షల రూపాయల ఫెలోషిప్‌తో అమెరికాలోని సెంటర్ ఫర్ వ్యాస్కులర్ బయాలజీ యూకాన్ హెల్త్ వర్సిటీలో ట్రెనీ సైంటిస్టుగా అశోక్‌కు అవకాశం ఇచ్చింది. రెండేళ్లుగా ఆగ్రరాజ్యంలో సైంటిస్టుగా శిక్షణ పొందుతున్న అశోక్‌కు అనేక దేశాల రీసెర్చ్ సెంటర్లు ఎక్కువ వేతనం ఇస్తామని ఆహ్వానిస్తున్నాయి.

అదే నా జీవితాశయం: సరైన అవకాశాలు లేకున్నా అశోక్‌ పట్టుదలతో చదువు కొనసాగించారు. తండ్రి చనిపోయినా తల్లికి ఏ లోటూ లేకుండా చూసుకున్నారు. సెలవు రోజుల్లో కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తూ... చదువుకునే వాడని అశోక్ తమ్ముడు ఆనంద్ తెలిపారు. విద్యార్ధుల్లో ప్రతిభ ఉంటే ప్రోత్సహించే ఉపాధ్యాయులూ ఉంటారని అశోక్‌ గురువు సుబ్బారెడ్డి అన్నారు. మహిళలకు బ్రెస్ట్ కేన్సర్ శాపంగా మారిందని... వారికి తక్కువ ఖర్చుతో మంచి చికిత్స అందించడమే తన జీవిత ఆశయమని అంటున్నారు అశోక్.

ఇదీ చదవండి:ఆత్మకూరు బరిలో మేకపాటి విక్రమ్‌రెడ్డి... వెల్లడించిన రాజమోహన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details