ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాండౌస్​ ముప్పు.. అతలాకుతలమైన రాష్ట్రం.. నేలరాలిన పంటలు

By

Published : Dec 12, 2022, 4:24 PM IST

Updated : Dec 12, 2022, 10:15 PM IST

RAINS IN ANDHRA PRADESH : మాండౌస్​ తుపాన్​ ప్రభావంతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉద్యానవన పంటలు నేలరాలడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొన్ని ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

RAINS IN ANDHRA PRADESH
RAINS IN ANDHRA PRADESH

మాండౌస్​ ముప్పు.. అతలాకుతలమైన రాష్ట్రం.. నేలరాలిన పంటలు

RAINS IN AP : మాండౌస్‌ తుపాను ప్రభావంగా గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో.. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న ఓ కారు వాగులో నిలిచిపోవడాన్ని గమనించిన స్థానికులు.. ట్రాక్టర్ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. రాజాంపల్లిలో వరి పైరు నీట మునిగింది. చందలూరు గ్రామంలో పొగాకు పందిళ్లు నేల రాలాయి.

బద్వేలులో లోతట్టు ప్రాంతాలు జలమయం: మాండౌస్‌ తుపాను ప్రభావంతో వైఎస్సార్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బద్వేలులో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ గ్యారేజ్‌లోకి వరద నీరు చేరడంతో బస్సుల మరమ్మతులకు అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావం వల్ల ఆర్టీసీకి నష్టం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ప్రయాణికులకు అంతరాయం లేకుండా బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

మిరపకాయలను కాపాడేందుకు రైతుల అగచాట్లు: మాండౌస్‌ తుపాను ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని మిర్చి రైతుల్ని దెబ్బతీసింది. మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో.. కల్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలను కాపాడుకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు. ఎక్కువ రోజులు పట్టాలు కప్పి ఉంచితే.. కాయలు బూజు పట్టి పాడైపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దర్శితోపాటు.. తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు దొనకొండ మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

40ఎకరాల్లో అరటి తోట ధ్వంసం: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాండౌస్ తుపాను కారణంగా నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో... వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చిట్వేల మండలం నాగవరం నగిరిపాడు, మహారాజపురం గ్రామాల సమీపంలోని 40 ఎకరాల్లో అరటి తోట ధ్వంసమైంది. రైల్వే కోడూరు మండలం గంగరాజుపోడు, రామయ్య పాలెం గ్రామాలలో నిర్మించిన రోడ్లు కొట్టుకుపోయాయి.

వరి పంటలు నేలరాలడంతో రైతుల ఆవేదన: మాండౌస్‌ తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునిగాయి. పొలాల్లో నీరు చేరడంతో కోత పూర్తైనా ఓదెలు నీటిలో నానుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను తుపాను దెబ్బతీసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో మునిగి వరి కంకులు మొలకలు వచ్చే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

ఉద్యానవన పంటలు ఆగం: తుపాను ప్రభావంతో...కురిసిన వర్షాలకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో... వ్యవసాయ, ఉద్యాన పంటలు పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న, అరటి, చెరకు పంటలు దెబ్బతిన్నాయని.. రైతులు వాపోయారు. శ్రీసత్యసాయి, అనంతపురంజిల్లాల్లో పంట నష్టంపై ప్రాథమిక అంచనా వేశామని వ్యవసాయశాఖ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు.

ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు: మాండోస్ తుఫాన్ ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురౌతున్నాయి. భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పెద్దూరు హరిజనవాడ దగ్గరున్న శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయం జలమయమైంది. ఆలయ ప్రాంగణంతో పాటు, గర్భగుడిలోకి వరద నీరు చేరింది. ఇటీవల ఆలయం వద్ద రోడ్డు ఎత్తుగా నిర్మించడంతో దేవస్థానం ప్రాంగణం లోతుట్టుగా మారిందని స్థానికులు తెలిపారు. 130 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం ముంపునకు గురౌవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలెవరైనా ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని స్థానికులు కోరుతున్నారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో.. భారీ వర్షానికి సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రధానంగా వరి నేలవాలింది. పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంట నష్టంపై సీఎం సమీక్ష: మాండౌస్​ తుపాను​ కారణంగా కురుస్తున్న వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను​ ప్రభావంతో పంటనష్టం అంచనాలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని సుచించారు. నష్టపరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించి.. వారం రోజుల్లో ముగించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. పంట నష్టాన్ని చూసి రైతులు నిరాశకు గురి కావొద్దని పేర్కొన్నారు. రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదనే మాట రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారన్న మాట రాకుండా.. సాధారణ ధాన్యానికి అందించే ధరనే అందించాలని అధికారులకు సూచించారు.

తర్వాత పంటకు 80 శాతం సబ్సిడీతో.. రైతులకు విత్తనాలు అందించాలని అన్నారు. ఇళ్లు ముంపునకు గురైతే కుటుంబానికి 2 వేల రూపాయలు ఆర్థిక సాయం, రేషన్‌ ఇవ్వనున్నట్లు సమావేశంలో తెలిపారు. ఇళ్లలోకి వరద వచ్చినా సరే.. ప్రభుత్వం పట్టించుకోలేదనే విధంగా చేయకుండా.. ఇళ్లలోకి వరదనీరు వస్తే కచ్చితంగా బాధితులకు సహాయం అందించాలని సీఎం సూచించారు. పట్టణాలు, పల్లెలు అని చూడకుండా బాధితులకు సహాయమందించాలని తెలిపారు. గోడ కూలి ఒకరు మరణించినట్లు సమాచారం వచ్చిందని.. మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 12, 2022, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details